షమీ ఆడాలంటే కండీషన్లు ఇవే, షాక్ ఇచ్చిన బీసీసీఐ
భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ షాక్ ఇచ్చింది. జట్టులోకి రావాలంటే పది రోజుల్లో తాను రెండు కండీషన్లను రీచ్ కావాలని స్పష్టం చేసింది. గాయం కారణంగా గత కొన్నాళ్ళుగా జట్టుకు షమీ దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి రంజీ జట్టులోకి అడుగు పెట్టాడు. బెంగాల్ తరుపున ఆడిన శమీ మంచి ప్రదర్శనే చేసాడు. అయితే జాతీయ జట్టుకు ఆ ప్రదర్శన సరిపోదని బోర్డ్ బృందం అంటోంది. అంతకు మించి కావాలని షమీకి రెండు కండీషన్లు పెట్టింది.
ఒకటి... షమీ గత ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉండటం, గాయం కారణంగా ఆస్పత్రికి పరిమితం కావడంతో భారీగా బరువు పెరిగాడు. దీనితో బరువు తగ్గాలని బోర్డు షరతు విధించింది. అలాగే ఫిట్నెస్ ను కూడా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ వైద్య బృందం అతన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మరో కండీషన్ విషయానికి వస్తే... మ్యాచ్ ముగిసిన తర్వాత షమీ... వైద్యుల పర్యవేక్షణ లేకుండా పూర్తిగా కోలుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అతన్ని జాతీయ జట్టులోకి తీసుకుంటారు.
దాని కంటే ముందు ప్రతిష్టాత్మక దేశవాళి టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ తన ఫాం ను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. అతని ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి అతనికి 10 రోజుల సమయం ఉందని తెలుస్తోంది. షమీ పూర్తిగా కోలుకుంటే, అతను డిసెంబర్ 14 నుండి ప్రారంభమయ్యే మూడో టెస్టు నుండి ఆడవచ్చని జాతీయ మీడియా పేర్కొంది. ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని షమీని ఆస్ట్రేలియా పంపకపోవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం షమీ కోసం బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ హెడ్ నితిన్ పటేల్, నేషనల్ క్రికెట్ అకాడమీ ట్రైనర్ నిషాంత్ బోర్డోలోయ్ బెంగాల్ జట్టుతో కలిసి పని చేస్తున్నారు.