ASBL NSL Infratech
facebook whatsapp X

రివ్యూ : సానపతిగా 'భారతీయుడు 2' 

రివ్యూ : సానపతిగా 'భారతీయుడు 2' 

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జెయింట్,
నటీనటులు : క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్,
నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం,
జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు
సంగీతం : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ : ర‌వివ‌ర్మ‌న్‌
ఆర్ట్‌ : ముత్తురాజ్‌, పాట‌లు:  శ్రీమ‌ణి, మాటలు :  హ‌నుమాన్ చౌద‌రి
స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సుంద‌ర్ రాజ్‌,  నిర్మాత‌:  సుభాస్క‌ర‌న్‌
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  ఎస్‌.శంక‌ర్‌
విడుదల తేదీ : 12.07.2024
నిడివి : 2 ఘంటల 52 నిముషాలు  

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన 'భారతీయుడు' 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించింది. అదే కాంబి తో ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాకి సీక్వల్ గా 'భారతీయుడు 2' గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ రోజు  జూలై 12న రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. టాక్ కూడా బయటకు వచ్చింది. భారతీయుడు 2 ఎలా ఉంది? సేనాపతి మళ్లీ వచ్చి ఏం చేశాడు? లంచగొండితనం, అవినీతి మీద ఇండియన్ తాత చేసిన పోరాటం ఏంటి? అన్నది సమీక్షలో చూద్దాం.  

కథ:

చిత్రా అరవింద్ (సిద్దార్థ్) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి  సోషల్ మీడియా వేదిక గా అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు. బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ చానెల్ నడుపుతూ అందులో అవినీతి పరుల మీద తనదైన శైలిలో కార్టూన్స్ రూపంలో ఫన్నీ సెటైరికల్ ఎపిసోడ్స్ నడిపిస్తుంటాడు. అరవింద్ తండ్రి వరదరాజన్ (సముద్రఖని) అవినీతి నిరోధక శాఖలో పని చేస్తుంటాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదురించాలని అరవింద్ ఆరాటపడుతుంటాడు. కానీ తిరిగి అరవింద్‌కే సమస్యలు వస్తాయి. అరవింద్ అండ్ గ్యాంగ్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక చేసేది లేక ఈ అవినీతి అంతమొందాలంటే భారతీయుడు (కమల్ హాసన్) మళ్ళీ రావాలని ఒక హ్యాష్ టాగ్  మొదలుపెట్టి వైరల్ చేస్తారు. చిత్ర అరవింద్  స్నేహితుడు ఒకరు భారతీయుడుని తైపీ నగరంలో చూశానని చెపుతాడు. అక్కడ భారతీయుడు (కమల్ హాసన్) ఒక వ్యాపారవేత్త (గుల్షన్ గ్రోవర్) న్యూ ఇయర్ క్యాలండర్ కోసం కొంతమంది మోడల్స్ తో సముద్రంలో చిత్రీకరణ చేస్తూ ఉంటాడు.

అవినీతిపరుడైన ఆ వ్యాపారవేత్తని భారతీయుడు చంపేస్తాడు. అక్కడనుండి మొదలవుతుంది అవినీతిపరులపై భారతీయుడి  వేట. ఇక తాను భారతదేశం వెళ్లాల్సిన పరిస్థితి ఆసన్నమైందని చెపుతాడు. చిత్ర టీము చేసిన యూట్యూబ్ వీడియోలు అన్నిటినీ చూస్తున్నాను అని చెపుతాడు. ఇక్కడ ఇండియాలో సిబిఐ అధికారి ప్రమోద్ (బాబీ సింహ) భారతీయుడుని ఇండియా వస్తున్నాడని తెలుసుకొని విమానాశ్రయంలో కాపు కాస్తాడు. ఇక ఇక్కడ నుండి భారతీయుడు, సిబిఐ అధికారి, అవినీతిపరుల మధ్య సాగే ఆటలు ఎలా సాగుతాయి? సేనాపతి యువతకు ఇచ్చిన సందేశం ఏంటి? ఆ సందేశాన్ని పాటించిన యువతకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? కమ్ బ్యాక్ ఇండియన్ హ్యాష్ ట్యాగ్ నుంచి గో బ్యాక్ ఇండియన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ క్రమంలో సేనాపతిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన సీబీఐ ఆఫీసర్ ప్రమోద్  పాత్ర ఏంటి?.. ఈ కథలో సకల కళా వల్లభుడు సద్గుణ పాండ్యన్ (ఎస్ జే సూర్య ) ప్రాముఖ్యత ఏంటి? అన్నదే మిగతా కథ.

నటీనటుల హావభావాలు :

కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు షరా మాములే. దశావతారంలో వేసినట్టుగా ఇందులోనూ లెక్కకు మించి గెటప్స్‌లో కనిపిస్తాడు. 106 ఏళ్ల తాతలా మాత్రం ఎక్కడా కనిపించడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేశాడు. అతని గొంతు రకరకాలుగా వుంది. కొన్ని సార్లు సూటయింది, కొన్నిసార్లు ఏదోలా వుంది. చాలా రోజుల తరువాత  సిద్దార్థ్‌కు చాలా లెంగ్తీ పాత్ర దొరికింది. అసలు ఈ రెండో పార్టుకి సిద్దార్థ్ హీరో అని కూడా చెప్పొచ్చు. సిద్దార్థ్ యాక్టింగ్ కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్‌లా అనిపిస్తుంది. అది తమిళ ఆడియెన్స్‌కు నచ్చుతుందేమో. కానీ తెలుగు ప్రేక్షకుడికి రుచించదు. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర అంతగా లేదు,  మూడు నాలుగు సీన్లు వచ్చి ఉంటాయి. ప్రియా భవానీకి కాస్త స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉందనిపిస్తుంది. బాబీ సింహా సిబిఐ అధికారిగా బాగున్నాడు. సముద్రఖని, ఎస్ జే సూర్య ఇలా ఏ పాత్ర కూడా పూర్తిగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతాయి. జాకిర్ హుస్సేన్, పీయూష్ మిశ్రా ఇంకా చాలామంది నటీనటులు కనపడతారు, అందరూ తమ పాత్రల పరిది మేరకి చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

దర్శకుడు శంకర్ సినిమా అనగానే ప్రేక్షకుడు చాలా పెద్దగా, గొప్పగా ఆశిస్తాడు. సినిమాలో చాల గొప్ప విషయం ఉంటుందని అనుకుంటాడు. ఇంతకు ముందు అతను చేసిన సినిమాలే అందుకు నిదర్శనం, అందుకే అతని సినిమాలపై అంచనాలు పెరుగుతూ ఉంటాయి. ఈసారి 28 ఏళ్ల క్రితం తీసిన 'భారతీయుడు' సినిమాకి సీక్వల్ గా ఇప్పుడు 'భారతీయుడు 2' తీసాడు. భారతీయుడు సినిమాను చూస్తే గుండె బరువెక్కుతుంది.. కళ్లు చెమర్చుతాయి. కానీ ఈ రెండో పార్ట్ ని చూస్తే నీరసం, అలసట వస్తాయి. ఏ మాత్రం ఎమోషనల్‌గా తీయలేకపోయాడు శంకర్. ఎవరి పాత్రని కూడా గుండెకు హత్తుకునేలా మల్చలేకపోయాడు దర్శకుడు. ప్రారంభం కూడా ఏమంత ఆసక్తిగా అనిపించదు. సేనాపతి ఎంట్రీ ఇచ్చాక అయినా గాడిన పడుతుందా? అంటే అదీ లేదు. ఇక సేనాపతి స్క్రీన్ పైకి వచ్చాడంటే.. ఎవరో ఒకరికి మూడిందనే అర్థం. కేవలం చంపడానికే అన్నట్టుగా సేనాపతి పాత్ర కనిపిస్తుంది. ఏ మాత్రం ఎమోషనల్‌గా సేనాపతి పాత్రకు ఆడియెన్స్‌కు మధ్య వారధిని శంకర్ క్రియేట్ చేయలేకపోయాడు.

అపరిచితుడులో ఒక్కొక్కరినీ ఒక్కో విధంగా చంపినట్టుగా.. ఇందులో వర్మం (మర్మ కళ)తో రకరకాలుగా చంపేస్తుంటాడంతే. కానీ శంకర్ ఈసారి ఈ సినిమాకి ఇంకో సీక్వల్ కూడా వుంది అని ప్రకటించేశాడు. అది 'భారతీయుడు 3' గా 2025లో వస్తోంది అని. అయితే ఇలా సీక్వల్స్ గా తీస్తున్నామని ముందుగానే ప్రకటించడంతో శంకర్ ఈ 'భారతీయుడు 2' లో తను అనుకున్నది కొంచెం చెప్పలేకపోయాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా పాత్రలను అసంపూర్ణంగా వదిలేశాడు. టెక్నికల్‌గా ఇండియన్ 2 బాగానే ఉంటుంది. టెక్నికల్ టీంను శంకర్ బాగానే వాడుకున్నాడు. విజువల్స్ అయితే గ్రాండియర్‌గా అనిపిస్తాయి. పాటల మీద శంకర్ మార్క్ కనిపిస్తుంది. కానీ ఆ పాటలు మళ్లీ వినడానికి, చూడటానికి పనికొచ్చేలా లేవు.  భారతీయుడు సినిమాకు ఏ ఆర్ రెహ్మాన్ ఇచ్చిన సంగీతం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటుంది. భారతీయుడు 2 పాటలు ఇంత వరకు ఒక్కరి నోటి నుంచి కూడా వినిపించలేదు. ఆర్ఆర్ కూడా రొటీన్‌గా అనిపిస్తుంది. ఇది వరకు అనిరుధ్ తన సినిమాలకు ఏవిధంగా ఇచ్చాడో ఇండియన్ 2కి కూడా అలానే ఇచ్చాడనిపిస్తుంది.  ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జెయింట్, నిర్మాణపు విలువలు భారీగా వున్నాయి.

విశ్లేషణ :

'భారతీయుడు 2' సినిమా శంకర్ సినిమాలపై పెంచుకున్న అంచనాలకి తగినట్టుగా లేకపోవటం కొంచెం నిరాశ పరుస్తుంది. 'భారతీయుడు' సినిమా అనేది ఒక సంచలనం అప్పట్లో, అది ఆలా వదిలేసి శంకర్ వేరే కథని సినిమాగా చేస్తే బాగుండేదేమో, కానీ అదే సినిమాకి సీక్వల్ గా తీసి, ఇందులో కథని మరీ సినిమాటిక్ గా చూపించేసాడు. రెండో పార్టు చూశాక, మూడు పార్టు కూడానా అని ప్రేక్షకుడు పెదవి విరుస్తూ బయటకి వస్తాడు. శంకర్ తన మేజిక్ టచ్ కోల్పోయారా అని అనిపిస్తుంది. బోరింగ్ ప్లే, అవుట్‌ డేటెడ్ సీన్స్ అండ్ పెద్దగా కథ కొత్తగా లేకపోవడం, మరియు కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా కమల్ తన లుక్స్ అండ్ పెర్పార్మెన్స్ తో తన అభిమానులను మాత్రమే అలరించారు. 
 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :