ASBL Koncept Ambience
facebook whatsapp X

అణుయుద్ధం అంచున ప్రపంచం..

అణుయుద్ధం అంచున ప్రపంచం..

రష్యాపై అమెరికా తయారీ దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు అనుమతిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోందా..? ఈ ఆయుధాలను తమపైకి ఉక్రెయిన్ ప్రయోగిస్తే.. ఈ యుద్ధంలో అమెరికా, నాటో కూడా దిగినట్లు భావిస్తామని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. పుతిన్ , రష్యా స్టేట్ మెంట్ ను పక్కన పెట్టి బైడన్ కీలక నిర్ణయం తీసుకోవడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఇంతకూ బైడన్ ధీమా వెనక కారణమేంటి..?

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలుపెట్టి వెయ్యి రోజులు పూర్తయిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి పశ్చిమ దేశాలు ఆమోదం తెలిపితే... నాటో, అమెరికా, ఐరోపా దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే భావిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కొన్ని రోజుల క్రితం పేర్కొన్నారు. నాటో సైనిక, సాయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకొని తాము కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం విభిన్నమైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తన అణు విధానానికి సవరణలు చేసిన రష్యా.. తాజాగా దానిని మరింత సరళతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పశ్చిమదేశాలు నేరుగా దాడి చేస్తే.. అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు సమాచారం.

రష్యా పైకి దీర్ఘ-శ్రేణి క్షిపణులను ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలని ఉక్రెయిన్‌ ఇప్పటికే పలుమార్లు మిత్ర దేశాలను కోరిందని.. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన నిర్ణయాలతో ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నారని మాస్కో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. బైడెన్‌ కార్యవర్గం ప్రమాదకర నిర్ణయం తీసుకుందని రష్యా డ్యూమా సభ్యురాలు మారియా బూటినా విమర్శించారు. మూడో ప్రపంచయుద్ధం వైపు నెట్టడానికి ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు.

బైడెన్‌ నిర్ణయం ఓ ‘గేమ్ ఛేంజర్‌’: ఉక్రెయిన్‌

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం (Russia- Ukraine Conflict) నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) తీసుకున్న నిర్ణయంపై ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిగా (Andriy Sybiga) స్పందించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో జో బైడెన్‌ తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ యుద్ధంలో ‘‘గేమ్‌ఛేంజర్‌’’గా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రష్యాపై దాడికి అమెరికా తయారుచేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను తాము ప్రయోగిస్తే యుద్ధభూమిలో చాలా మార్పులు వస్తాయని.. రష్యా భూభాగంలోని సైనిక స్థావరాలపై దాడి చేసే హక్కు కీవ్‌కు ఉందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ ఎంత ఎక్కువగా దాడి చేస్తే ఇరుదేశాల మధ్య యుద్ధం అంత వేగంగా తగ్గుముఖం పడుతుందని ఆండ్రీ అభిప్రాయం వ్యక్తంచేశారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukraine War) మంగళవారంతో 1000వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నిర్వహించిన యూఎన్‌ (UN) భద్రతా మండలి సమావేశానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :