Adani : అదానీని బీజేపీ వెనకేసుకొస్తోందా..?
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అదానీ, మణిపూర్ అంశాలపై చర్చకు విపక్ష ఇండియా కూటమి పట్టుబడుతోంది. అదానీని బీజేపీ ప్రభుత్వం వెనకేసుకొస్తోందని.. మోదీ సర్కార్ ఈ దేశ సంపదను ఆయనకు దోచి పెడ్తోందని రాహుల్ గాంధీ పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం వాటిని పట్టించుకోవట్లేదు. తన పని తాను చేసుకుపోతోంది. అయితే ఇప్పుడు అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం.. అరెస్ట్ వారెంట్ జారీ కావడం.. సంచలనం కలిగిస్తోంది. ఇప్పుడైనా బీజేపీ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంటుందా.. అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అదానీ కంపెనీ అడ్డదారులు తొక్కి వ్యాపారాలు చేస్తోందంటూ హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదిక ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. దీనిపై అనేక విచారణ సంఘాలు తమ పని చేసుకుంటూ పోతున్నాయి. అయితే సుప్రీంకోర్టులో అదానీకి ఊరట లబించడంతో ఈ వ్యవహారం తుస్ మనింది. దీంతో చట్టపరంగా అదానీ బయటపడినట్లయింది. అయితే ఇప్పుడు అదానీ గ్రీన్ ఎనర్జీ వ్యవహారంలో అదానీపై మరోసారి ఆరోపణలు వచ్చాయి. ఈసారి ఏకంగా ఆయనపై అమెరికాలోనే కేసు నమోదైంది. దీంతో ఈ వ్యవహారంపై చర్చించాలని ఇండియా కూటమి పట్టుబడుతోంది.
అదానీ లంచాలిచ్చి కాంట్రాక్టులు దక్కించుకున్నారని అమెరికా ఆరోపించింది. ఇది చట్టవిరుద్ధం కాబట్టి ఆయనపై కేసు పెట్టింది. ఇండియాలో జరిగిన అవినీతిపై అమెరికా స్పందించి కేసు పెట్టింది. కానీ ఇండియా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఇదిప్పుడు బీజేపీ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. అదానీతో మోదీ అంటకాగుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదేపదే విమర్శిస్తున్నారు. ఇప్పుడు అదానీపై కేసు పెట్టకపోవడానికి కూడా కారణం ఇదేనని ఆయన చెప్తున్నారు. అదానీ అవకతవకలు బయటకు రావాలంటే కేసులు సరిపోవని.. పార్లమెంటు జాయింట్ కమిటీ కావాలనేది ఆయన డిమాండ్.
అదానీపై ఎన్ని విమర్శలు వచ్చినా మోదీ సర్కార్ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెర వెనుక ఏదో జరుగుతోందనే అనుమానాలను మరింత బలపరుస్తోంది. కాబట్టి ఇప్పడైనా మోదీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం, లేకుంటే అదానీతో ఒప్పందాలను రద్దు చేసుకోవడం లాంటివి చేస్తే మచ్చ చెరిపేసుకునేందుకు వీలవుతుందనే సూచనలు వస్తున్నాయి. మరి ఈ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది వేచి చూడాలి.