ASBL Koncept Ambience
facebook whatsapp X

బీఆర్ నాయుడికి టీటీడీ పగ్గాలు..!! 

బీఆర్ నాయుడికి టీటీడీ పగ్గాలు..!! 

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీటీడీ పాలకమండలిపై అత్యంత ఆసక్తి నెలకొంది. టీటీడీ పాలకమండలిలో స్థానం కోసం ఎంతో మంది ఆశావహులు పోటీ పడ్డారు. ముఖ్యంగా టీటీడీ ఛైర్మన్ పదవికోసం చాలా మంది ప్రముఖులు రాయబారాలు సాగించారు. అయితే ముందునుంచి టీవీ5 ఛైర్మన్ బి.ఆర్.నాయుడి పేరు టీటీడీ పాలకమండలి ఛైర్మన్ రేసులో బలంగా వినిపించింది. చివరకు ఆయనకే ఆ పదవి కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. మొత్తం 24 మందితో పాలకమండలిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో సగానికి పైగా సభ్యులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. తెలంగాణ నుంచి ఐదుగురికి, కర్నాటక నుంచి ముగ్గురికి, తమిళనాడు నుంచి ఇద్దరికి చోటు దక్కింది. గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు.

టీటీడీ ఛైర్మన్ పదవిని దక్కించుకున్న బీఆర్ నాయుడు అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచలంచెలుగా ఎదిగారు. ప్రస్తుత తిరుపతి జిల్లా పెనుమూరు మండలం కలవకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని దిగువ పూనేపల్లిలో బీఆర్ నాయుడు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మునిస్వామినాయుడు, లక్ష్మి 1970లో హైదరాబాద్ వెళ్లారు. బీహెచ్ఈఎల్ లో ఉద్యోగిగా పనిచేసిన బీఆర్ నాయుడు ఉద్యోగ సంఘం నాయకుడిగా పని చేశారు. 2007లో టీవీ5 ఛానల్ ప్రారంభించారు. గత ఐదేళ్లూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ నాయుడితో పాటు ఆయన చానల్ పై జగన్ ప్రభుత్వం అనేక కేసులు పెట్టి వేధించింది. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించి పని చేశారు. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు గట్టిగా పనిచేశారు. అందుకే బీఆర్ నాయుడికి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు చంద్రబాబు.

పాలకమండలి సభ్యులు:

జ్యోతుల నెహ్రూ: జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే, మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోవడంతో టీటీడీ సభ్యుడిగా అవకాశమిచ్చారు. 
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి: నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే. గతంలోనూ టీటీడీ సభ్యురాలు.
ఎంఎస్‌ రాజు: మడకశిర ఎమ్మెల్యే, ఎస్సీ వర్గానికి చెందిన టీడీపీ కీలక నేత. గత వైసీపీ ప్రభుత్వం ఆయనపై 60కి పైగా కేసులు నమోదు చేసింది. 
పనబాక లక్ష్మి: కేంద్ర మాజీ మంత్రి. తాజా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. అందుకే టీటీడీ సభ్యురాలిగా నియమించారు. 
నన్నూరి నర్సిరెడ్డి: తెలంగాణకు చెందిన నేత. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి. 
జాస్తి పూర్ణసాంబశివరావు: హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త. అమెరికాలోని డాలస్‌లో స్థిరపడ్డారు.
నన్నపనేని సదాశివరావు: నాట్కో గ్రూప్ వైస్‌ ఛైర్మన్‌. గుంటూరులోని జీజీహెచ్‌లో క్యాన్సర్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు.  
కృష్ణమూర్తి వైద్యనాథన్‌: చెన్నైకి చెందిన వైద్యనాథన్‌ 2015 నుంచి వరుసగా టీటీడీ సభ్యులుగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సన్నిహితులు. కంచి కామకోటి మఠం కోఆర్డినేటర్, అథెనా ఎమ్రా పవర్‌ డైరెక్టర్‌.
అక్కిన మునికోటేశ్వరరావు: రాజమహేంద్రవరానికి చెందిన వ్యాపారవేత్త. చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఆయన కుటుంబసభ్యులకు అండగా నిలిచారు.  
మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌: నంద్యాల లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడు. జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు.
జంగా కృష్ణమూర్తి: ఎన్నికల ముందు ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. గతంలోనూ టీటీడీ సభ్యుడిగా పనిచేశారు. 
దర్శన్‌ ఆర్‌.ఎన్‌.: బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త.  
జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌: 2014 సెప్టెంబరు నుంచి 2015 డిసెంబరు వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 
వైద్యం శాంతారాం: టీడీపీ కుప్పం క్లస్టర్‌ ఇన్‌ఛార్జి. టీడీపీ నాయీబ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేశారు. 
పి.రామ్మూర్తి: తమిళనాడులోని కుమారనాథపురానికి చెందినవారు.
తమ్మిశెట్టి జానకీదేవి: మంగళగిరికి చెందిన టీడీపీ అధికార ప్రతినిధి. చేనేత వర్గానికి చెందిన నేత. 
బొంగునూరి మహేందర్‌రెడ్డి: తెలంగాణ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు.
అనుగోలు రంగశ్రీ: విజయవాడకు చెందిన రంగశ్రీ జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు.
బూరగాపు ఆనంద్‌సాయి: శ్రీకాకుళానికి చెందిన ఆనంద్‌ సాయి సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు సన్నిహితుడు. యాదాద్రి ఆలయ పునర్మిర్మాణంలో ఆర్కిటెక్ట్‌గా పనిచేశారు.  
సుచిత్ర ఎల్ల: భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌. ఎల్ల ఫౌండేషన్‌ డైరెక్టర్‌. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా టీటీడీ సభ్యురాలిగా పని చేశారు. 
ఎస్‌.నరేశ్‌కుమార్‌: బెంగళూరుకు చెందిన ఆయన ఈవెంట్‌ ఇన్‌ఫ్రా, అడ్వర్టైజింగ్, పబ్లిసిటీ రంగంలో ఉన్నారు. ఏబీవీపీ బెంగళూరు నగర సంయుక్త కార్యదర్శిగా, కార్యదర్శిగా పనిచేశారు. 
డాక్టర్‌ ఆదిత్‌ దేశాయ్‌: ఈయన భారత వైద్యమండలి మాజీ అధ్యక్షుడు కేతన్‌ దేశాయ్‌ కుమారుడు.
సౌరభ్‌ హెచ్‌.బోరా: మహారాష్ట్రకు చెందిన బోరా 2021, 2023 సంవత్సరాల్లో వైసీపీ హయాంలోనూ టీటీడీ సభ్యుడిగా పనిచేశారు. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :