ASBL NSL Infratech
facebook whatsapp X

వైసీపీకి బీఆర్ఎస్ దూరం..! ఆ పార్టీయే కారణమా..?

వైసీపీకి బీఆర్ఎస్ దూరం..! ఆ పార్టీయే కారణమా..?

శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడంటారు. ఏపీ, తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఇలాంటి వాతావరణాన్ని మనం చూస్తుంటాం. బీఆర్ఎస్, టీడీపీ మధ్య వైరం ఉంది. దీంతో టీడీపీ వ్యతిరేక పార్టీ వైసీపీ.. బీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలో ఏపీలో శాంతిభద్రతలపై వైసీపీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కచ్చితంగా వైసీపీ మిత్రపక్షంగా భావించే బీఆర్ఎస్ హాజరవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ ధర్నాకు బీఆర్ఎస్ తరపున ఒక్కరు కూడా హాజరు కాలేదు. కనీసం సంఘీభావం కూడా ప్రకటించలేదు. దీంతో ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందని అందరూ అనుకుంటున్నారు.

ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమిలోని పలు పార్టీలు హాజరై జగన్ కు సంఘీభావం ప్రకటించాయి. ఏపీలో ఎన్డీయే కూటమి శాంతిభద్రతల విషయంలో విఫలమైందని విమర్శించాయి. అయితే ఈ ధర్నాకు బీఆర్ఎస్ హాజరు కాకపోవడంపై అటు ఢిల్లీలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీ ఓటమిపై బీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో స్పందించారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా.. ఏపీలో వైసీపీ గెలుస్తుందనుకున్నామని చెప్పారు. మొదటి నుంచి బీఆర్ఎస్ – వైసీపీ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ స్నేహం ఇలాగే కొనసాగుతుందనుకున్నారు.

అయితే జగన్ క్లిష్ట పరిస్థుతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ మాత్రం ఆయనకు అండగా నిలబడలేకపోయింది. ఇందుకు బీజేపీ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఏపీలో వైసీపీ ఓడిపోయినట్లే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది. అప్పటి నుంచి తెలంగాణలో గడ్డు పరిస్తితులు ఎదుర్కొంటోంది. ఒక వైపు కేసులు వెంటాడుతున్నాయి. మరోవైపు కేడర్ దూరమవుతోంది. పార్టీని నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గత నాలుగు నెలలుగా జైల్లో ఉంటోంది. ఇలాంటప్పుడు కేంద్రంలోని బీజేపీ కూటమికి వ్యతిరేకంగా వెళ్లకపోవడమే బెటర్ అనే ఫీలింగులో బీఆర్ఎస్ ఉన్నట్టు సమాచారం.

ఏపీలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తోంది ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగానే.! ఇలాంటప్పుడు జగన్ తో కలిసి వెళ్తే అది బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేకపోవచ్చు. అలా చేస్తో కొరివితో తల గోక్కున్నట్టే. పైగా జగన్ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు హాజరవుతున్నాయి. బీఆర్ఎస్ కూడా వెళ్తే అది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది. అందుకే ఆ ధర్నాకు బీఆర్ఎస్ హాజరు కాలేదు. జగన్ కు దూరంగానే ఉండిపోయింది. ఇందుకు బీజేపీయే కారణమనే విషయం అందరికీ తెలిసిందే.!

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :