BRS: బీఆర్ఎస్ కోసం ట్రబుల్ షూటర్స్ పాదయాత్ర..!?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసిన పార్టీ బీఆర్ఎస్. అందుకే ఆ పార్టీని పదేళ్లపాటు అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కించుకున్న బీఆర్ఎస్.. ఆ తర్వాత ఐదు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో పార్టీ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఓ వైపు రేవంత్ రెడ్డి దూకుడు.. మరోవైపు పార్టీ నేతల్లో నిరుత్సాహం ఏర్పడడంతో బీఆర్ఎస్ మనుగడపై అనేక అనుమానాలు తలెత్తాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట్లో తీవ్ర దూకుడు ప్రదర్శించారు. బీఆర్ఎస్ ను ఖాళీ చేయించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని అందరికీ అర్థమైంది. అలాగే పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా పార్టీని వదిలేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ దూకుడు చూసిన వాళ్లంతా ఇక బీఆర్ఎస్ మనుగడ కష్టమే అనుకున్నారు. అయితే ఆ తర్వాత కాలం గడిచేకొద్దీ రేవంత్ దూకుడు తగ్గింది. అదే సమయంలో హైడ్రా, మూసీ, రుణమాఫీ లాంటి అంశాలు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతకు కారణమయ్యాయి. సరిగ్గా ఇదే అంశాలను క్యాష్ చేసుకోవడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది. ఎవరి పాలననైనా అంచనా వేసేందుకు ఈ సమయం చాలా తక్కువ. రేవంత్ రెడ్డికి కూడా ఏడాది పాటు సమయం ఇచ్చి తర్వాత పాలనా వైఫల్యాలపై ఉద్యమించాలని గతంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈలోపే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు బెడిసికొట్టడంతో బీఆర్ఎస్ కు ఆయుధం చిక్కినట్లయింది. వాటిని అస్త్రాలుగా మార్చుకున్న బీఆర్ఎస్ నేతలు పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రేవంత్ వైఫల్యాలను ఎండగడుతూ ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు రేవంత్ వైఫల్యాలపై మరింత స్పీడ్ పెంచాలనుకుంటున్నారు బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీశ్ రావు. వీళ్లిద్దరూ త్వరలోనే పాదయాత్రకు శ్రీకారం చుడతారనే టాక్ నడుస్తోంది. దక్షిణ తెలంగాణలో హరీశ్ రావు, ఉత్తర తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోందని పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పార్టీ బలోపేతానికి దోహదపడేలా ఈ యాత్రను రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. కేడర్ లో ఉత్తేజాన్ని నింపడం ద్వారా త్వరలో జరగబోయే జమిలి ఎన్నికల్లో విజయం సాధించాలనే ఆలోచనలో ఇలా పాదయాత్రలకు ప్లానే చేసినట్లు సమాచారం.