ASBL Koncept Ambience
facebook whatsapp X

BRS: మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా..?

BRS: మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారనుకున్నారు. అదే ఊపులో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. పదేళ్లపాటు సత్తా చాటింది. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో దేశాభివృద్ధి కుంటుపడుతోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీ అవసరం ఉందని భావించారు. అందులో భాగంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారు. దేశమంతా తిరిగారు. పలు పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. కేసీఆర్ హడావుడి చూసి ఏదో చేయబోతున్నారని అందరూ అనుకున్నారు.

బీజేపీని కేంద్రంలో గద్దె దించాలనే లక్ష్యంతో కేసీఆర్ స్పీడ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లో హడావుడి చేశారు. ముఖ్యంగా మహారాష్ట్రపైన కేసీఆర్ ఎక్కువగా దృష్టి సారించారు. తెలంగాణను ఆనుకుని ఉన్న నాందేడ్, నాగపూర్, సోలాపూర్ లాంటి ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో మొత్తం నాలుగు చోట్ల బహిరంగసభలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, శివసేన పార్టీల నుంచి పలువురు నేతలు, రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ లో చేరారు కూడా. మహారాష్ట్ర ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ పోటీ చేస్తుందని అందరూ ఆశించారు.

ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ ఎన్నికల హడావుడిలో మునిగిపోయాయి. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం అసలు మహారాష్ట్రపై దృష్టే పెట్టినట్టు కనిపించట్లేదు. కేసీఆర్ తెలంగాణ గురించే నోరు విప్పట్లేదు. ఇక మహారాష్ట్ర గురించి ఏం పట్టించుకుంటారని సెటైర్లు వేసుకుంటున్నారు జనం. అయితే మహారాష్ట్ర నేతలు మాత్రం కేసీఆర్ ఏమైనా స్పందిస్తారేమోనని ఆశిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేయకపోయినా ఏదైనా పార్టీకి మద్దతివ్వడమో.. లేకుంటో పొత్తు పెట్టుకోవడమో చేయొచ్చని సూచిస్తున్నారు.

అయితే ... ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ దాటి వెళ్లకపోవడమే బెటర్ బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్ కు సూచించినట్టు సమాచారం. తెలంగాణలోనే ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం సరికాదని.. తప్పుడు సంకేతాలు వెళ్తాయని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. తెలంగాణలో పార్టీని కాపాడుకుని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే చాలని.. మిగిలిన విషయాలన్నీ ఇప్పుడు అప్రస్తుతమని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పేరు కూడా మార్చేసి టీఆర్ఎస్ పెట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇలాంటప్పుడు మిగిలిన రాష్ట్రాల గురించి ఆలోచించే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఇక బీఆర్ఎస్ తెలంగాణకు మాత్రమే పరిమితం కానుంది. మిగిలిన రాష్ట్రాలను వదిలేసినట్లే..!

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :