ASBL Koncept Ambience
facebook whatsapp X

AP Elections : ఏపీలో మళ్లీ ఎన్నికలు...! వైసీపీకి నో ఛాన్స్..!!

AP Elections : ఏపీలో మళ్లీ ఎన్నికలు...! వైసీపీకి నో ఛాన్స్..!!

ఆంధ్రప్రదేశ్ లో వరుస ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగి కేవలం ఆరు నెలలు మాత్రమే అయింది. ఈలోపే కొన్ని ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. వాటి ప్రచారం కొనసాగుతోంది. ఇంతలో మరో ఉపఎన్నికకు తెరలేసింది. మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెలలోపే ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఖాళీ అయిన మూడు స్థానాలూ వైసీపీవే. కానీ ఇప్పుడు ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం కనిపించట్లేదు. మరి ఈ మూడు స్థానాలను ఎవరు దక్కించుకునే అవకాశముంది..?

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు రాజీనామాలు చేస్తున్నారు. అయితే ఏదైనా పార్టీలో చేరాలంటే పార్టీతో పాటు పదవులకు కూడా రాజీనామా చేసి రావాలని నిబంధన పెడుతున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీల్లో చేరేందుకు వైసీపీ నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఇప్పటివరకూ ఎంపీ పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వీళ్లలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. ఆర్.కృష్ణయ్య మాత్రం ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు.

మోపిదేవి వెంకటరమణ రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన్ను ఎమ్మెల్సీగా పంపించి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే టాక్ నడుస్తోంది. బీద మస్తాన్ రావు మాత్రం తనకు ఢిల్లీలోనే ఉండాలని ఉందని చెప్పారు. దీంతో ఆయనకు మరోసారి రాజ్యసభ అవకాశం కల్పిస్తారని సమాచారం అందుతోంది. మోపిదేవి వెంకటరమణ స్థానాన్ని మాత్రం మరో కీలక నేతకు టీడీపీ ఇవ్వొచ్చని సమాచారం. ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండింటిని టీడీపీ తీసుకునే అవకాశం ఉంది. ఇక ఆర్.కృష్ణయ్య ఏ పార్టీలో చేరతారో ఆ పార్టీకి మరో స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆర్.కృష్ణయ్యని తెలంగాణ రాజకీయాల్లో వాడుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే బీజేపీ తరపున ఏపీ నుంచి ఓ వ్యక్తి రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం ఉంది.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ 11 మంది రాజ్యసభ స్థానాలను గెలుచుకుంది. వాళ్లలో ముగ్గురు ఇటీవల రాజీనామా చేశారు. ఈ స్థానాలన్నింటినీ అధికార ఎన్డీయే కూటమే దక్కించుకునే అవకాశం ఉంది. ఒక్కో ఎంపీకి కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తాజా ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఒక్క సీటును కూడా వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపించట్లేదు. మరోవైపు ప్రస్తుతం టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు కనీసం ఇద్దరిని రాజ్యసభకు పంపించే అవకాశం టీడీపీకి దక్కుతోంది. మరి ఆ అదృష్టవంతులెవరో తెలియాల్సి ఉంది.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :