Trump: హామీలు నెరవేర్చాల్సిందే...కెనడాకు ట్రంప్ క్లారిటీ...
ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(trudeau) భేటీ అయ్యారు. ఫ్లోరిడాలోని ట్రంప్ మార్ ఏ లాగో ఎస్టేట్‌లో విందులో వీరిద్దరు పాల్గొన్నారు. ఇరువురు మధ్య చర్చ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అధిక సుంకాలను నివారించేందుకు కెనడాను యునైడెట్ స్టేట్స్‌లో “51వ రాష్ట్రం”గా చేయడంపై జోక్ చేశారు. కెనడా వలసదారులు, డ్రగ్స్ సరిహద్దును దాటి అమెరికాలోకి రావడాన్ని నివారించకపోతే కెనడియన్ దిగుమతులపై అధిక సుంకాలు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ట్రంప్‌కి చెందిన ప్రైవేట్ ఎస్టేట్ మార్ ఏ లాగోలో కెనడియన్ పీఎం జస్టిన్ ట్రూడోతో చర్చించారు. సరిహద్దుల్లో నియంత్రణపై ట్రూడో ట్రంప్‌కి ప్రామిస్ చేశారు.. కెనడా మొత్తం వస్తువులు, సేవల్లో 75 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఒక వేళ అమెరికా సుంకాలను విధిస్తే, కెనడా తీవ్రంగా నష్టపోతుంది. కెనడా తన డిమాండ్లను నిర్వహించకపోతే, సరిహద్దు సమస్యలను నియంత్రించడం, వాణిజ్య లోటును చెల్లించడం వంటివి చేయకుంటే, కెనడా అమెరికాలో మరో రాష్ట్రంగా మారాలి, ట్రూడో రాష్ట్ర గవర్నర్‌గా ఉంటారని ట్రంప్ కఠినంగానే చమత్కరించారు.
‘‘70కి పైగా దేశాల నుండి వచ్చిన అక్రమ వలసదారులతో సహా పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు, ప్రజలను సరిహద్దులో అనుమతించడం ద్వారా కెనడా US సరిహద్దులో సమస్య జఠిలమైంది. మరొకటి కెనడా-యూఎస్ వాణిణ్య సమస్య, ఇది 100 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ.’’ తాను జనవరి 20, 2025లో అధికారం చేపట్టి సమయానికి కెనడా ఈ డిమాండ్లను నిరవేర్చకుంటే కెనడియన్ వస్తువులపై 25 శాతం సుంకాన్ని విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.