ASBL Koncept Ambience
facebook whatsapp X

YSRCP – EC : వైసీపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్..!

YSRCP – EC : వైసీపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు అనుకూలించట్లేదు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడాన్ని ఆ పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అప్పటి నుంచి పలువురు నేతలు పార్టీని వీడితున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంతమంది రాజీనామా చేశారు. జిల్లాల్లో కీలక నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. అయితే ఇప్పటికీ స్థానిక సంస్థలన్నీ దాదాపు వైసీపీ చేతిలోనే ఉన్నాయి. అక్కడైనా పట్టు నిలుపుకోవాలంటున్న వైసీపీకి.. అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించట్లేదు. ఇప్పుడు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో విజయబావుటా ఎగరేయాలనుకున్న వైసీపీకి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది.

విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గతంలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున ఇందుకూరి రఘురాజు విజయం సాధించారు. అయితే గతేడాది ఇందుకూరి రఘురాజు భార్య ఇందుకూరి సుధారాణి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో రఘురాజుపైన కూడా వైసీపీ నేతలు అనుమానాలు పెంచుకున్నారు. ఆయన కూడా టీడీపీకి సహకరిస్తున్నారని భావించారు. దీంతో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మనే మోషేన్ రాజుకు వైసీపీ అప్పీల్ చేసుకుంది. దీన్ని పరిశీలించిన అనంతరం మోషేన్ రాజు.. ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేశారు.

దీంతో.. తనపై అనర్హతను సవాల్ చేస్తూ రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరుగుతున్న సమయంలో విజయనగరం ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడంతో ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకకోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 28న ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో వైసీపీ తరపున శంబంగి చిన అప్పలనాయుడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. విజయనగరం జిల్లాలోని స్థానిక సంస్థలన్నీ ఇప్పటికీ వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. దీంతో ఈ స్థానం కచ్చితంగా వైసీపీ వశమవుతుంది. ఇంతలో రఘురాజు పిటిషన్ ను విచారించిన హైకోర్టు అనర్హత చెల్లదని తీర్పు చెప్పింది. దీంతో రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగుతారని స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు హైకోర్టు తీర్పు రఘురాజుకు అనుకూలంగా తీర్పు చెప్పింది. మరోవైపు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో నామినేషన్ల ఘట్టం కూడా జరుగుతోంది. ఇలాంటప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక పార్టీలు తలలు పట్టకున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర న్నికల ప్రధానాధికారి ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇది వైసీపీ ఏమాత్రం ఊహించని పరిణామం. ఈ స్థానంలో ఎన్నిక జరిగితే తప్పకుండా తమ ఖాతాలో పడుతుందని భావించింది. ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయింది.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :