ASBL NSL Infratech

వాలంటీర్లను ఏం చేద్దాం..? చంద్రబాబు ప్రభుత్వం తర్జనభర్జన..!?

వాలంటీర్లను ఏం చేద్దాం..? చంద్రబాబు ప్రభుత్వం తర్జనభర్జన..!?

ఇటీవలి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియామకం ద్వారా ప్రభుత్వ పథకాలను వారికి నేరుగా ఇంటివద్దకు చేర్చేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగింది. అయితే వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వంలో భాగం కాదని.. వాళ్లంతా వైసీపీ మనుషులని కూటమి పార్టీలు ఆరోపించాయి. అదే సమయంలో వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరుగుతోంది కాబట్టి దాన్ని రద్దు చేస్తామని చెప్పలేకపోయాయి.

వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలు జరుగుతోంది కాబట్టి వాళ్లే తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లని వైసీపీ ప్రకటించింది. వాళ్ల ద్వారా కచ్చితంగా ఓట్లు పడతాయని నమ్ముకుంది. అదే సమయంలో దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు నేరుగా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నందున వారిని టార్గెట్ చేస్తే తమకు ఇబ్బందులు తప్పవని భావించాయి కూటమి పార్టీలు. అందుకే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోమని.. పైగా జగన్ ప్రభుత్వం రూ.5వేలు ఇస్తే తాము అధికారంలోకి వస్తే రూ.10వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చాయి. ఇప్పుడు వైసీపీ ఓడింది. కూటమి అధికారంలోకి వచ్చింది.

వాలంటీర్ వ్యవస్థను ఎక్కువుగా నమ్ముకున్న జగన్ ఇప్పుడు దారుణంగా ఓటమి పాలయ్యారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ ఏమాత్రం వైసీపీకి ఉపయోగపడలేదని అర్థమైపోయింది. అలాగని ఆ వ్యవస్థను రద్దు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే తాము రద్దు చేయబోమని, భృతి పెంచుతామని హామీ ఇచ్చింది టీడీపీ. మాట తప్పే పరిస్థితి లేదు. పైగా గతంలో వైసీపీ ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామాలు చేసిన వాలంటీర్లంతా మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో వాలంటీర్ వ్యవస్థను ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం.

ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టేసినట్లు అర్థమవుతోంది. వాళ్లకు ఎలాంటి విధులు ఇవ్వకుండా సైడ్ చేసేసింది. వచ్చే నెలలో పింఛన్లను ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి అందించే బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగించింది ప్రభుత్వం. ఒక్కో సచివాలయ ఉద్యోగికి కొంతమంది లబ్దిదారులను కేటాయించింది. దీంతో వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తుందనేది అర్థం కావట్లేదు. వాలంటీర్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. వాళ్లను సమాంతరంగా కాకుండా ప్రభుత్వంలో భాగం చేసి వాడుకునేలా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :