ASBL NSL Infratech
facebook whatsapp X

ఏపీకి బ్రాండ్ ఇమేజ్‌పై చంద్రబాబు ఫోకస్..!

ఏపీకి బ్రాండ్ ఇమేజ్‌పై చంద్రబాబు ఫోకస్..!

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి నెల కావస్తోంది. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసి అభివృద్ధిని పట్టించుకోవట్లేదనే అపవాదును మూటగట్టుకుంది. అయితే చంద్రబాబు మాత్రం తనకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తన యాక్షన్ ప్లాన్ ఉండేలా చూసుకుంటున్నారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుండడంతో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తుందనే నమ్మకం కలుగుతోంది.. అన్నిటికీ మించి ఏపీకి మళ్లీ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు చంద్రబాబు.

గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసింది. నేరుగా లబ్దిదారులకు అకౌంట్లలో నగదు జమచేస్తూ వచ్చింది. అయితే అభివృద్ధిని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్రానికి చెప్పుకోదగ్గ పరిశ్రమలేవీ రాలేదు. పైగా అమరావతిని పక్కన పెట్టేయడంతో అక్కడికి వస్తామని చెప్పిన పలు సంస్థలు కూడా తిరిగి వెళ్లిపోయాయి. చివరకు మౌలిక వసతులైన రోడ్లను కూడా పట్టించుకోకపోవడంతో అతుకులమయమైపోయాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్లంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్ తరాలకు తాత్కాలిక సంక్షేమం కంటే రాష్ట్రాభివృద్ధే ముఖ్యమని భావించిన ప్రజలు జగన్ ను ఓడించి చంద్రబాబుకు పట్టం కట్టారు.

చంద్రబాబు సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకోరని.. కానీ అభివృద్ధి చేయడంలో మాత్రం భేషుగ్గా పని చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. దేశవిదేశాల నుంచి కొత్త కంపెనీలను తీసుకురావడం, టెక్నాలజీలో కొత్తపుంతలు తొక్కించడం చంద్రబాబుకు అలవాటు. అందుకే ఆయన్ని సీఈఓ అని కూడా పిలుస్తుంటారు కార్పొరేట్ మేధావులు. ఇప్పుడు ఏపీలో కూడా అభివృద్ధిని పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు చంద్రబాబు. గత ఐదేళ్లలో అభివృద్ధి పూర్తిగా అటకెక్కిందని భావిస్తున్న ఆయన.. సరికొత్త యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు.

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో రాష్ట్రంలో కంపెనీలు పెడతామని చెప్పి వెనక్కు వెళ్లిపోయిన సంస్థలను తిరిగి రప్పించేందుకు చొరవ తీసుకున్నారు. ఆయా కంపెనీలతో మాట్లాడి తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మీ పెట్టుబడులకు తాను గ్యారెంటీ ఇస్తున్నానని మాటిచ్చారు. దీంతో పలు కంపెనీలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమరావతిలో పెట్టుబడులు పెడతామని చెప్పి వెనక్కు వెళ్లిపోయిన 20కి పైగా కంపెనీలు ఇప్పుడు మళ్లీ ముందుకొచ్చాయి.

మరోవైపు రాష్ట్ర విభజనచట్టంలో పేర్కొన్న పెండింగ్ అంశాలపైన కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. ఏపీలో పెట్రో కెమికల్ రిఫైనరీ పెట్టాలని విభజన చట్టం సూచించింది. అందుకు తగ్గట్టుగానే మచిలీపట్నంలో బీపీసీఎల్ పెట్రో కెమికల్ రిఫైనరీ పెట్టేందుకు ముందుకొచ్చింది. 60వేల కోట్లకు పైగా ఇక్కడ బీపీసీఎల్ పెట్టుబడి పెడుతుందని అంచనా. ఇది పూర్తయితే పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మరోవైపు.. విన్ సాఫ్ట్ కంపెనీ 4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు.

గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింది. కొత్తగా కంపెనీలేవీ ఇక్కడికి రాలేదు. పైగా అమరరాజా లాంటి కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఏపీకి మళ్లీ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. దెబ్బతిన్న ఇమేజ్ ను తిరిగి తీసుకురావాలంటే ముందు అందుకు తగ్గ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు దృష్టంతా దానిమీదే ఉంది. పారిశ్రామిక వేత్తలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పరిశ్రమలు ఆకర్షించవచ్చు. ఇందుకోసం జల, వాయు, రోడ్డు రవాణా మార్గాలను భారీగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అప్పుడు అభివృద్ధి ఆటోమేటిక్ గా పరుగులు తీస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ఆ పనిలోనే ఉన్నట్టు అర్థమవుతోంది. మరి చూడాలి చంద్రబాబు ఎంతవరకూ సక్సెస్ అవుతారో.!!

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :