Chandrababu : చంద్రబాబుకు ఇండియా టుడే ఇచ్చిన కితాబేంటి..!?
రాజకీయ పార్టీలకు, నేతలకు సమస్యలు మామూలే. వాటన్నిటినీ ఎదుర్కొని నిలబడగలిగితేనే విజయం సాధించగలరు. సమస్యలను ఎదుర్కోలేని వాళ్లు మధ్యలోనే పొలిటికల్ జర్నీ నుంచి తప్పుకుంటూ కనుమరుగైపోతుంటారు. కానీ మరికొందరు మాత్రం ఎలాంటి సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొని నిలబడగలుగుతారు. రాజకీయాల్లో సత్తా చాటుతుంటారు. అలాంటివాళ్లలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందున్నారని ప్రముఖ జాతీయ మేగజైన్ ఇండియా టుడే వెల్లడించింది. దేశంలో శక్తివంతవంతమైన ప్రముఖుల జాబితాలో చంద్రబాబు నాయుడికి చోటు కల్పించింది.
దేశంలో అత్యంత శక్తివంతుడైన నేత ఎవరంటే కచ్చితంగా ప్రధాని మోదీయో ముందుంటారు. ఎందుకంటే అంతర్జాతీయ సమాజంలోనే మోదీ అగ్రగణ్యుడిగా ఉంటున్నారు. అలాంటప్పుడు దేశంలో కూడా ఆయన్ను మించిన వాళ్లు ఎవరుంటారు..? ఇండియా టుడే జాబితాలో కూడా మోదీకి నెంబర్ వన్ స్థానం దక్కింది. రెండో స్థానంలో ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్, మూడో స్థానంలో అమిత్ షా, నాలుగో స్థానంలో రాహుల్ గాంధీ, ఐదో స్థానంలో చంద్రబాబు నిలిచారు. అంటే టాప్ 5లో చంద్రబాబు నాయుడికి చోటు దక్కింది. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత, ఒక ముఖ్యమంత్రికి ఈ స్థానం దక్కడం ఆశ్చర్యం కలిగించింది.
చంద్రబాబుకు ఐదో స్థానం కట్టబెట్టిన ఇండియా టుడే.. ఆయన ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఫీనిక్స్ పక్షిలా ఎగసిన వ్యక్తి అని అభిప్రాయపడింది. రాజకీయాల్లో ఇక చంద్రబాబు పనైపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఆయన సత్తా చాటి దేశంలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగారని తెలిపింది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ మనగుడ కచ్చితంగా చంద్రబాబు నాయుడిపై ఆధారపడి ఉందని ఇండియా టుడే తేల్చి చెప్పింది. అందుకే ఆయన టాప్ 5లో చోటు దక్కించుకోవడమే కాకుండా మోస్ట్ పవర్ ఫుల్ చీఫ్ మినిస్టర్ గా కొనియాడింది.
వాస్తవానికి చంద్రబాబు ప్రస్థానం అడుగడుగునా అనేక సవాళ్లమయమే అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఉన్నంతవరకూ ఆయన నెంబర్ టూగా పార్టీలో కీలకపాత్ర పోషించారు. ఇక 1994 సంక్షోభంలో పార్టీని చేజిక్కించుకున్న తర్వాత 1995లో తొలిసారి సీఎం అయ్యారు. ఆ తర్వాత 1999లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే ఆర్థిక సంస్కరణలను అమలు చేసి శెభాష్ అనిపించుకున్నారు. దేశంలో ఎవరూ సంస్కరణల జోలికి వెళ్లని సమయంలో చంద్రబాబు సాహసం చేశారని చెప్పొచ్చు. 2004లో చంద్రబాబు ఓడిపోయారు. 2009లో కూడా పార్టీ అధికారంలోకి రాలేదు. ఇదే సమయంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో టీడీపీకి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం టీడీపీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేసింది. అయినా చంద్రబాబు మాత్రం ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని పార్టీని కాపాడుకునేందుకు తుదివరకూ ప్రయత్నించారు.
అదే సమయంలో వైఎస్ మరణించడంతో జగన్ పార్టీ పెట్టారు. సానుభూతి వెల్లువెత్తుతున్న సమయం అది. కానీ 2014 ఎన్నికల్లో వాటన్నిటినీ తట్టుకుని ఏపీలో అధికారంలోకి రాగలిగారు చంద్రబాబు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నారు. అయితే 2019 నాటికి టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైపోయింది. టీడీపీ చరిత్రలోనే ఇంత తక్కువ సీట్లు రావడం ఇదే తొలిసారి. మరోవైపు జగన్ అణచివేతతో టీడీపీ అల్లాడిపోయింది. చివరకు చంద్రబాబును జైలుకు కూడా పంపించారు జగన్. దీంతో ఇక పార్టీ పనైపోయిందనుకున్నారు. లోకేశ్ కు పార్టీని నడపడం సాధ్యం కాదన్నారు. కానీ 2024 ఎన్నికల్లో మళ్లీ ఉవ్వెత్తున ఎగసారు చంద్రబాబు. ఇప్పుడు అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుని సత్తా చాటారు. అటు కేంద్రంలో కూడా ప్రభుత్వం తనపైన అధారాపడేంత స్థాయికి ఎదిగారు. అందుకే చంద్రబాబును ఫీనిక్స్ పక్షితో పోల్చుతూ మోస్ట్ పవర్ ఫుల్ సీఎంగా పేర్కొంది ఇండియా టుడే.