Chandrababu srikakulam visit: ఉత్తరాంధ్రలో బాబు.. స్కెచ్ మామూలుగా లేదుగా..
2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు 5 నెలలు గడుస్తున్న సందర్భంగా చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. నవంబర్ 1, 2 వ తేదీలలో ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చంద్రబాబు రావడం ఇదే తొలిసారి. ఈ మేరకు ముఖ్యమంత్రి షెడ్యూల్ కూడా ఖరారు అయ్యింది. ఇక ఈ రోజున ఎన్నికలకు ముందు బాబు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభించనున్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా ఆంధ్రాలోని పేద మహిళలకు న్యాయం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన భారీ హామీలలో ఒకటైన గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఉత్తరాంధ్రలు అత్యంత వెనకబడిన జిల్లాగా భావించబడే శ్రీకాకుళాన్ని ఎంచుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం రేపు చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటన చేస్తారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలం పురిటిపెంట పర్యటించనున్న బాబు అక్కడ రోడ్లపై గుంతలు పూచే కార్యక్రమంలో పాల్గొంటారు. అస్తవ్యస్తంగా తయారైన రోడ్ల మరమ్మతులకు రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం 826 కోట్ల రూపాయాల్తో మరమ్మత్తులు చేపడుతున్న క్రమంలో చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా నుంచి ప్రారంభిస్తారు. మొత్తానికి ఈ విధంగా చంద్రబాబు సంక్షేమాన్ని శ్రీకాకుళంతో.. అభివృద్ధిని విజయనగరంతో కనెక్ట్ చేసి ప్రారంభిస్తున్నారు.
అనంతరం నవంబర్ 2న చంద్రబాబు విశాఖ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కీలకమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇక ఇందులో భాగంగా చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్ తయారీకి సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతుంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలను జనంలోకి బలంగా తీసుకువెళ్లడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. ఇక రాబోయే 2047 నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్టేట్ గా మార్చడానికి చంద్రబాబు ప్రవేశపెట్టిన విజన్ 2047 కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజలలో బలమైన నమ్మకానికి పునాదులు వేయడానికి సిద్ధపడుతున్నారు.