చెవిరెడ్డి వర్సెస్ బాలినేని.. ప్రశ్నల వార్ లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..
ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు.. అటు నేషనల్.. ఇటు ఇంటర్నేషనల్ మీడియాలో అదానీతో విద్యుత్ ఒప్పందాలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందాలలో సుమారు 1,750 కోట్ల లంచం తీసుకున్నట్లుగా వచ్చిన వార్తలు తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. ఇందులో జగన్ పాత్ర పై ఓ పక్క చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంలో బాలినేని ఇన్వాల్వ్మెంట్ పై కూడా చర్చ జరిగింది. ఎందుకంటే ఈ లావాదేవీలు జరిగిన సమయంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నది బాలినేని శ్రీనివాసరావు కావడంతో.. ఈ కేసు విషయంలో ఆయన ప్రమేయం ఎంతవరకు ఉంది అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. అయితే బాలినేని మాత్రం తనకు ఈ విషయం అసలు తెలియదని.. సెకీతో ఒప్పందంలో తన ప్రమేయం ఏమీ లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దీనిపై తాజాగా చెవిరెడ్డి తన స్టైల్ లో స్పందించారు.
బాలినేని ఇప్పటికి కూడా కేవలం రాజకీయ స్వార్థంతోనే మాట్లాడుతున్నాడు అంటూ చెవిరెడ్డి మండిపడ్డారు. ఎనర్జీ కమిటీ ఫైల్ పై అతను సంతకం పెట్టలేదా? అని ప్రశ్నించారు. అంతేకాదు వైసీపీ హయాంలో బాలినేని కి ఉన్నంత స్వేచ్ఛ మరి ఎవరికీ లేదు అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు.సెకీ ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది అని గత టిడిపి ప్రభుత్వం అప్పట్లో రూ.4.50కు ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని వైసీపీ రూ.2.48కే మార్చి ఒప్పందం కుదుర్చుకుందని ఆయన ఆరోపించారు.
అయితే దీనిపై స్పందించిన బాలినేని అసలు చెవిరెడ్డికి ఏం తెలుసా ఈ విషయంలో మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అదానీతో విద్యుత్ ఒప్పందాలు విషయంలో లంచం తీసుకున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో అప్పటి మంత్రిగా తాను ఏం జరిగిందో చెప్పాను అని బాలినేని స్పష్టం చేశారు. అంతేకాదు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో మాత్రమే ఆయన మరణానంతరం మంత్రి, ఎమ్మెల్యే పదవులను వదులుకొని మరి జగన్కు మద్దతుగా వెళ్లినట్లు బాలినేని స్పష్టం చేశారు. అంతేకాదు సెకీతో ఒప్పందం అంశంలో తనకు ఎటువంటి సంబంధం లేదని.. అసలు సిఎండి ఫైల్ తన వద్దకే రాలేదని బాలినేని కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు. బాలినేని చెప్పిన ఈ అంశం గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. మరి ఇక దీనిపై ఇప్పుడు చెవిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.