పరవాడ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా
అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని మరో పరిశ్రమ నుంచి విషవాయువు లీకై కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ కంపెనీలో మంగళవారం విషవాయువు లీకై 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని గాజువాకలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒడిశాకు చెందిన కార్మికుడు అమిత్ (22) మృతి చెందాడని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని కార్మిక సంఘాలు తెలిపాయి. మరో వైపు ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం చేయాలన్న ముఖ్యమంత్రి, బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.