Chandrababu House : అమరావతిలో ఇల్లు కట్టుకోబోతున్న చంద్రబాబు..!!
ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు దాటిపోయింది. ఈ పదేళ్లలో ఐదేళ్లు తెలుగుదేశం (TDP), మరో ఐదేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) పార్టీ అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు (Chandrababu) అధికారం చేపట్టారు. విభజిత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. ఆయనే అమరావతిని (Amaravati) ఏపీ కొత్త రాజధానిగా ప్రకటించారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు. ఉండవల్లిలోని (Undavalli) అద్దె భవనంలో ఉండేవారు. ఆ తర్వాత వచ్చిన జగన్ తాడేపల్లిలో (Tadepalli) సొంత ఇంటిని నిర్మించుకున్నారు. అక్కడి నుంచే పరిపాలన సాగించారు. చంద్రబాబు కనీసం ఇంటిని కట్టుకోలేదని అప్పట్లో వైసీపీ (YCP) నేతలు విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చారు. దీంతో ఈసారి అలాంటి విమర్శలకు చెక్ పెట్టాలనుకుంటున్నట్టున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో ఇంటికోసం స్థలంకొన్నారు. వెలగపూడిలో (Velagapudi) దాదాపు 25వేల చదరపు గజాలను ఆయన కొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఇంటి నిర్మాణంకోసం అవసరమైన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. మట్టి నాణ్యత లాంటివాటిని పరిశీలిస్తున్నారు. త్వరలోనే భూమిపూజ చేసి ఇంటి నిర్మాణం ప్రారంభించనున్నారు. ఈ-6 రోడ్డుకు ఆనుకున్న ఈ ఫ్లాట్ ను ముగ్గురు రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. సీడ్ యాక్సిస్ రోడ్డు దీని నుంచే వెళ్లనుండడం, నాలుగు వైపులా రోడ్లు ఉండడం ఈ స్థలం ప్రత్యేకత. ప్రభుత్వ భవనాల సముదాయాలన్నీ ఈ స్థలానికి కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉండనున్నాయి. మొత్తం జాగాలో కొంత భాగంలో మాత్రమే ఇంటిని నిర్మించనున్నారు. మిగిలిన స్థలంలో పార్కింగ్ సదుపాయం, రక్షణ సిబ్బందికి అవసరమైన గదులు, పార్క్ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.
ఉండవల్లిలో ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్ట్టేట్ (Lingamaneni Estate) పై అనేక విమర్శలున్నాయి. దీనికి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా చెల్లిస్తున్నారని గతంలో విమర్శిస్తూ వచ్చింది. తన గెస్ట్ హౌస్ ను వాడుకుంటున్నట్టుందుకు లింగమనేనికి పరోక్ష లబ్ది చేకూరుస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని టీడీపీ వివరణ ఇచ్చింది. మరోవైపు కృష్ణానదికి (River Krishna) వరదలు వచ్చినప్పుడు ఈ ఇల్లు మునుగుతోంది. ఇటీవల బుడమేరు వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు 10 రోజులపాటు ఈ ఇంట్లోకి అడుగు పెట్టలేకపోయారు. ఇల్లు మునిగినందు వల్లే చంద్రబాబు ఇంటికి వెళ్లట్లేదని.. వరద సహాయక చర్యల పేరుతో మభ్యపెడుతున్నారని వైసీపీ విమర్శిస్తూ వచ్చింది. ఇలా ఎన్నో ఆరోపణలు ఈ ఇంటిపై ఉన్నాయి.
ఇలాంటి ఆరోపణలన్నింటికీ శాశ్వతంగా చెక్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుకే వెలగపూడిలో శాశ్వత ఇంటిని నిర్మించుకోవాలనుకున్నారు. వచ్చే నెలలో ఈ ఇంటికి భూమిపూజ చేస్తారని సమాచారం. రెండేళ్లలో ఇంటిని పూర్తి చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్ లో ఇటీవలే తన పాత ఇంటిని పునర్నిమించుకున్నారు చంద్రబాబు. మరోవైపు మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయం (NTR Bhavan) ఇప్పటికే ఏర్పాటైంది. ఇప్పుడు ఇంటి నిర్మాణం కూడా పూర్తయితే చంద్రబాబు శాశ్వత అడ్డా అమరావతి కానుంది.