ASBL Koncept Ambience
facebook whatsapp X

Super 6 : సూపర్ 6పై విమర్శలకు చెక్ చెప్పబోతున్న చంద్రబాబు..!?

Super 6 : సూపర్ 6పై విమర్శలకు చెక్ చెప్పబోతున్న చంద్రబాబు..!?

ఆంధ్రప్రదేశ్ (AP) లో తెలుగుదేశంపార్టీ (TDP) అధికారంలోకి రావడానికి దోహదం చేసిన హామీల్లో సూపర్ సిక్స్ (super 6) ప్రధానమైనది. నిరుద్యోగులకు ఉపాధి (employment) లేదా నెలకు రూ.3వేల భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు, ప్రతిరైతుకు (farmers) ఏటా రూ.20వేల ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు (gas cylinders), ప్రతి మహిళకు (women) నెలకు రూ.1500, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం (free bus) కల్పిస్తామని సూపర్ సిక్స్ హామీలిచ్చారు చంద్రబాబు. అయితే అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఈ హామీల జోలికి ఆయన వెళ్లలేదు. దీంతో జగన్ (YS Jagan) పదేపదే ఈ విషయాన్ని లేవనెత్తుతున్నారు.

సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తావని చంద్రబాబును (Chandrababu) నిలదీస్తున్నారు జగన్. సూపర్ సిక్స్ కు బడ్జెట్లో (budget) నిధులు కేటాయించాల్సి వస్తుందని.. ఆ పని చేయలేకే చంద్రబాబు పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టకుండా తప్పించుకుంటున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. అయితే జగన్ సహా ఇలాంటి ఆరోపణలన్నింటికీ చెక్ పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

చంద్రబాబు జూన్ 12న అధికార బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మొదటి నెల నుంచే పెంచిన రూ.4వేల పింఛన్లను (pensions) అమలు చేశారు. అయితే సూపర్ సిక్స్ జోలికి మాత్రం వెళ్లలేదు. అయితే ఇప్పుడు దశల వారీగా వాటిని అమలు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. మొదటగా దీపావళి (deepavali) నుంచి మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయబోతున్నారు. తర్వాత నెలలోనే మహిళలకు ఉచిత బస్సు రవాణా లాంఛ్ చేయబోతున్నారు. తల్లికి వందనం (thalliki vandanam) పేరిట చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఏటా రూ.15వేలు ఇచ్చే స్కీంను వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా అమలు చేయనున్నారు. మార్చి లేదా ఏప్రిల్ నుంచి రైతులకు అన్నదాతా సుఖీభవ (annadatha sukhibhava) స్కీం ద్వారా ఏటా రూ.20వేల ఆర్థిక సాయం చేయనున్నారు.

వచ్చే యేడాది జూన్ నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఈలోపే సూపర్ సిక్స్ హామీలన్నింటినీ అమలు చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు చంద్రబాబు. ఇందుకు ఎంతమేర నిధులు అవసరమవుతాయో అధికారులు అంచనాలు వేసే పనుల్లో ఉన్నారు. వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆ బడ్జెట్లో సూపర్ సిక్స్ స్కీంలన్నింటికీ నిధులు కేటాయించనున్నారు. అప్పటి నుంచి ఏటా నిర్దిష్ట తేదీల్లో ఈ స్కీం అమలయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా విమర్శలకు చెక్ పెట్టాలనుకుంటున్నారు చంద్రబాబు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :