ASBL NSL Infratech
facebook whatsapp X

మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ : చంద్రబాబు

మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీకి సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్‌ శాఖపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి. నేరస్థుడే రాజకీయ నేత, సీఎం అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లలో చూశాం. మేం విడుదల చేస్తోన్న 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుంది అని అన్నారు. మద్యపాన నిషేధం, లిక్కర్‌ ఔట్‌లెట్స్‌ తగ్గింపు అని చెప్పి అన్నీ మరిచారని విమర్శించారు. 

ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలి. మద్యం ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని చెప్పారు. పొరుగురాష్ట్రాలతో పోలిస్తే ధరలు విపరీతంగా పెంచారు. అయినా మద్యం వినియోగం అమాంతం పెరిగిపోయింది. అయినా, ఏపీలో ఆదాయం తగ్గింది. ఎందుకంటే పెరిగిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందన్నారు. 

దేశంలో దొరికే లిక్కర్‌ ఏపీలో దొరకలేదు. ఐదు టాప్‌ బ్రాండ్ల కంపెనీలను తరిమేశారు. చెల్లింపు ఆలస్యం చేయడం, ఆర్డర్‌లు ఇవ్వకపోవడం వంటి చర్యలతో వేధించారు. లోకల్‌ బ్రాండ్లు తీసుకొచ్చి షాపుల్లో విక్రయించారు. ఏవి అమ్మితే అవే తాగి పరిస్థితికి తెచ్చారు. మద్యం అనేది ఒక వ్యసనం. పేదవాడు శారీరకంగా కష్టపడి బాధలు మర్చిపోయేందుకు తాగుతారు. వారి అలవాటును బలహీనంగా చేసుకొని దోచుకున్నారు. ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో డబ్బును తీసుకొచ్చి ఎక్సైజ్‌ శాఖలో పెట్టుబడి పెట్టించారు. దీంతో ఆయా శాఖలకు దాదాపు రూ.250 కోట్ల నష్టం వాటిల్లింది. ఎక్సైజ్‌ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. సరైన పాలసీలు తీసుకొచ్చి పేదలకు అందుబాటు ధరలో మద్యం లభించే విధంగా చూడటంతో పాటు డీఅడిక్షన్‌ సెంటర్లనూ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. ఏ విధంగా ప్రక్షాళన చేయాలో శాసనసభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలి. తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తేనే మళ్లీ తప్పు జరగకుండా ఉంటుంది. మంత్రులంతా వారి శాఖల్లోని అవకతవల్ని వెలికితీయాలి అని అన్నారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :