మేం ఊహించిన దాని కంటే ఎక్కువ : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బడ్జెట్‌పై శాసనసభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే కూటమిగా ఏర్పడి పోటీ చేశామన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర అని తెలిపారు. మోదీ, పవన్, ప్రజలు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని దానిని నిలబెట్టుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.
రాష్ట్ర విభజన సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. 2014లో మనకు లోటు కరెంట్ ఉండేది. అనేక విధానాలు తీసుకొచ్చి మిగులు కరెంట్ పరిస్థితికి తెచ్చాం. రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. అమరావతి రైతులు ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చారు. 2019లోనూ విజయం సాధించి ఉంటే, 2021లోనే పోలవరం పూర్తయ్యేది. ఫలితాలు చూసేవాళ్లం. ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మేం ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం చేశారు. గత ప్రభుత్వం జీవోలను కూడా ఆన్‌లైన్‌లో ఉంచలేదు. కాగ్‌కు కూడా నివేదికలు ఇవ్వలేదు. విభజన నష్టం కంటే గత ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగింది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోయేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. ఇప్పుడు భావి తరాలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం అని చంద్రబాబు తెలిపారు.