ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో.., ఒకరు తెలుగువారే : సీఎం చంద్రబాబు
గడచిన ఐదేళ్లలో 227 ఎంవోయూలు జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. గత ఐదేళ్లలో పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచటం వల్ల పరిశ్రమలు మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. 1995 కంటే ముందు లైనెన్స్ రాజ్ కారణంగా పెట్టుబడులు రాలేదు. ఆ తర్వాత ఆర్థిక సంస్కరణల కారణంగా ఏపీలోనూ ఐటీని ప్రోత్సహించగలిగాం. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగువారే ఉన్నారంటే అప్పటి విధానపరమైన నిర్ణయమే కారణం. 2047 నాటికి భారత్ నంబర్ వన్ దేశంగా తయారైతే ఏపీ కూడా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలనే ఈ పాలసీలు తీసుకొచ్చాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ప్రాధాన్యత. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా విధానం మార్చుకున్నాం. ఉత్పత్తి వ్యయం తగ్గించటం, బ్రాండ్ ఇలా అన్ని అంశాల్లోనూ దృష్టి పెట్టాం అని అన్నారు. ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని సాధ్యం చేసి చూపుతాం. ఏ విధానమైనా 2024`29 వరకు అమల్లో ఉండేలా చర్యలు తీసుకుంటాం. 175 నియోజకవర్గాల్లో ప్రతీ చోట పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాం. పోర్టు అధారిత పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతాం అని తెలిపారు.