దావోస్ సదస్సుకు సీఎం చంద్రబాబు
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వచ్చే జనవరి 20 నుంచి 24 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక ( డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రులు, అధికారుల బృందం వెళ్లనుంది. అక్కడ ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు అధికారుల బృందం మంగళవారం దావోస్ బయల్దేరి వెళ్లింది. ఏపీ ఈడీబీ సీఈఓ సి.ఎం.సాయికాంత్ వర్మ, ఏపీఐఐసీ ఎండీ ఎం.అభిషిక్త్ కిశోర్ దావోస్ వెళ్లారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ బుధవారం వెళుతున్నారు. అధికారుల బృందం ఈ నెల 22 వరకు దావోస్‌లో ఉంటుంది. దావోస్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ఏర్పాటు, సమావేశాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను అధికారుల బృందం ఎంపిక చేస్తుంది. డబ్ల్యూఈఎఫ్ సదస్సు సందర్భంగా అక్కడ ఏపీ ప్రతినిధులకు అవసరమైన సహకారం, ఏర్పాట్లపై దావోస్ కౌన్సిల్ ప్రతినిధులతో చర్చిస్తుంది. షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అన్న థీమ్‌తో వచ్చే సంవత్సరం డబ్లూయీఎఫ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.