ASBL Koncept Ambience
facebook whatsapp X

సీఎం రేవంత్ ప్రాజెక్టుల బాట..

సీఎం రేవంత్ ప్రాజెక్టుల బాట..

లక్షకోట్లకు పైగా నిధులతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెల్లఏనుగులా మారింది. దానికి ఇప్పుడు రిపేర్లు చేయించినా ఫలితం ఎంతవరకూ ఉంటుందో తెలియదు. ఈపరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్.. సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలోని కృష్ణా,గోదావరి బేసిన్ నదులపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా .. వీలైనన్ని ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. దీంతో వాటికి సంబంధించిన వివరాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు.

అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వేగంగా ఆయకట్టుకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారు. రూ.241 కోట్లు ఖర్చు చేయడం ద్వారా 48వేల ఎకరాలకు వేగంగా సాగునీరు అందించే ఆరు ప్రాజెక్టులపై ఆయన దృష్టిసారించారు. తక్కువ ఖర్చుతో అసంపూర్తిగా ఉన్నవి పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో అర్ధాంతరంగా పనులు నిలిచిపోయిన ప్రాజెక్టుల వివరాలను నీటిపారుదల శాఖ ఇంజినీర్ల నుంచి తెప్పించుకుని సీఎం పరిశీలించారు. రైతులకు సాగునీరు అందించాలంటే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఇటీవల పలు దఫాలుగా ఆరు ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత తొందరగా సాగునీటిని అందించేందుకు వీలున్న వాటిని చేపడితే రైతులకు మేలు జరుగుతుందని.. అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా గోదావరి పరీవాహకంలోని నీల్వాయి ప్రాజెక్టు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్‌ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు.

నీల్వాయి ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి ఎత్తిపోతల పథకం కింద నిర్మల్‌ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, మత్తడివాగుతో ఆదిలాబాద్‌ జిల్లా, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండో దశతో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్‌ ప్రాజెక్టుతో నిర్మల్‌ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుంది. వీటికి సంబంధించి పనులు పూర్తి చేసేందుకు దాదాపు రూ.241 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదల శాఖ అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. వచ్చే ఏడాది 2025 మార్చి నాటికి వందకు వంద శాతం ఈ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని, అప్పటికల్లా ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :