మళ్లీ విశ్వాసం పెరిగేలా పనిచేయాలి : సీఎం రేవంత్
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేసి, దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించాలని కొత్త వైఎస్‌ఛాన్సలర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కొత్తగా నియమితులైన ఉపకులపతులు సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొంతకాలంగా యూనివర్సిటీలపై నమ్మకం తగ్గుతోందని, మళ్లీ విశ్వాసం పెంచేలా పనిచేయాలన్నారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాని ఉపకులపతులకు సీఎం సూచించారు. యూనివర్సిటీల్లో ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం కోసం అవసరమైతే కన్సల్టెన్సీలను నియమించుకొని నివేదిక తయారు చేసుకోవాలన్నారు. ఒత్తిళ్ల ప్రభావంతో వీసీలను నియమించలేదని ప్రతిభ, సామాజిక సమీకరణలనే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. వీసీలు బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, తప్పులు చేస్తే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ, ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో వీసీలను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సీఎం వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టి పెట్టాలని, విద్యార్థులను గమనిస్తూ అవసరమైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు.