కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే.. ఎంత దూరమైనా : సీఎం రేవంత్
ప్రజలనే కాదు, వేములవాడ రాజన్ననూ కేసీఆర్ మోసం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వేములవాడ గుడిచెరువులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రేవంత్ మాట్లాడారు. కేసీఆర్‌ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలిపారు. మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదా పడుతూ వస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 30న మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని తెలిపారు.
దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్. పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ ఇక్కడే నుంచే ప్రకటన చేశారు. తెలంగాణ బిల్లును ఆమోదింపచేయడంలో కరీంనగర్ బిడ్డ, జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే. ఎంత దూరమైనా వెళ్తుంది. పొన్నం ప్రభాకర్‌ను ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం సాధించారు. బండి సంజయ్‌ను రెండు సార్లు పార్లమెంట్‌కు పంపిస్తే కేంద్ర మంత్రి అయ్యారు కానీ, కరీంనగర్ జిల్లాకు కేంద్రం నుంచి చిల్లి గవ్వ అయినా తెచ్చారా? కరీంనగర్ అభివృద్ధి కోసం ఎప్పుడైనా పార్లమెంట్‌లో మాట్లాడారా? అంతకు ముందు 3 సార్లు బీఆర్‌ఎస్ ఎంపీలు గెలిపిస్తే వాళ్ల కూడా కరీంనగర్‌కు చేసిందేమీ లేదన్నారు.