ASBL Koncept Ambience
facebook whatsapp X

‘ఐటీసర్వ్‌’ సదస్సుకు రండి... చంద్రబాబు, లోకేష్‌కు ఆహ్వానం

‘ఐటీసర్వ్‌’ సదస్సుకు రండి... చంద్రబాబు, లోకేష్‌కు ఆహ్వానం

అక్టోబరు 29, 30ల్లో లాస్‌వెగాస్‌లో సదస్సు

అమెరికాలోని ఐటీ కంపెనీల కన్సార్షియం ‘ఐటీసర్వ్‌ అలయెన్స్‌’ తమ వార్షిక సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించింది. సదస్సుకు ప్రత్యేక అతిథిగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఆహ్వాన పత్రం అందించింది. ‘సినర్జీ’ పేరుతో నిర్వహించే ఈ సదస్సు అక్టోబరు 29, 30 తేదీల్లో లాస్‌వెగాస్‌లోని సీజర్‌ ప్యాలెస్‌లో జరగనుంది. ఐటీసర్వ్‌ అలయెన్స్‌ గవర్నింగ్‌బాడీ ఛైర్మన్‌ అమరేశ్వరరావు వరద, సభ్యుడు వినోద్‌బాబు ఉప్పు, ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడు సురేష్‌ మానుకొండ చంద్రబాబు, లోకేశ్‌లను కలిసి ఆహ్వానం అందజేశారు. ఈ సదస్సుకు తాను హాజరవుతానని మంత్రి లోకేశ్‌.. ప్రతినిధులకు హామీనిచ్చారు. ‘సినర్జీ-2024లో వివిధ రంగాలను ప్రభావితం చేసే గొప్ప నాయకులు, ఇన్నోవేటర్స్‌, అనేక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. ముఖ్యంగా ఐటీ రంగం నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు పాల్గొంటారు. 

గతంలో జరిగిన ఐటీసర్వ్‌ అలయెన్స్‌ వార్షిక సదస్సుల్లో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి బుష్‌, బిల్‌ క్లింటన్‌లతోపాటు, హిల్లరీ క్లింటన్‌, సద్గురు జగ్గీవాసుదేవ్‌, నిక్కీ హేలీ వంటి ప్రముఖులు హాజరయ్యారని తెలిపారు. వచ్చే నెలలో జరిగే ‘సినర్జీ’ సదస్సుకు ప్రత్యేక అతిథిగా పెప్సీకో మాజీ సి.ఇ.ఒ. ఇంద్రా నూయీ కూడా హాజరవుతున్నారు.

ఐటీసర్వ్‌ అలయెన్స్‌ వార్షిక సదస్సులో 2,500కు పైగా ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు, ప్రయోగాలు, ఏఐ, డేటా సైన్స్‌, క్లౌడ్‌ వంటి కొత్త టెక్నాలజీలకు సంబంధించిన అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయని సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా వారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం రూ.10 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. 

ఐటీసర్వ్‌ అలయెన్స్‌ సుమారు 2,500 చిన్న, మధ్యతరహా ఐటీ స్టాఫింగ్‌, సర్వీసెస్‌ కంపెనీలతో ఏర్పాటైన కన్సార్షియం. ఈ కన్సార్షియంలోని కంపెనీల మొత్తం వార్షిక ఆదాయం 1,000 కోట్ల అమెరికా డాలర్లు. ఈ సంస్థకు అమెరికాలోని 21 రాష్ట్రాల్లో చాప్టర్లు ఉన్నాయి. అమెరికాతోపాటు, భారత్‌లోనూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. భారత్‌లో ఐటీసర్వ్‌ అలయెన్స్‌కు అనుబంధంగా ఉన్న కంపెనీలు హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, నోయిడా వంటి నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఐటీసర్వ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ జగదీష్‌ మొసాలి, ప్రతినిధులు రఘు చిట్టిమళ్ల, సురేష్‌ పొట్లూరి ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :