ASBL Koncept Ambience
facebook whatsapp X

వైఎస్సార్ వారసత్వం కోసం పోటాపోటీ..!?

వైఎస్సార్ వారసత్వం కోసం పోటాపోటీ..!?

 

ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి. ఆయన జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి నుంచి చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అంచలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం అధిరోహించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు సైతం తలలో నాలుకలా ఉంటూ పార్టీకోసం పాటుపడ్డారు. అయితే ఇప్పుడు వైఎస్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్ల ఆయన వారసత్వం కోసం పోటాపోటీ నడుస్తోంది. ఒకవైపు కుమారుడు జగన్, మరోవైపు కుమార్తె షర్మిల వైఎస్ వారసులం తామేనని చెప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

1978లో రాజకీయాల్లోకి వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పటి నుంచి ఆయన 2009లో ప్రాణాలు విడిచే వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాజీవ్ గాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకూ అందరూ వైఎస్ ను అమితంగా ఇష్టపడతారు. వైఎస్ కూడా గాంధీ ఫ్యామిలీకోసం ఎంతో చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నారు. దీంతో వైఎస్ అంటే గాంధీ ఫ్యామిలీకి అంత ఇష్టం. అయితే ఆయన మరణానంతరం తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. పార్టీ కేడర్ మొత్తాన్ని జగన్ లాగేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా పోయింది.

అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జెండాలు మళ్లీ రెపరెపలాడుతున్నాయి. ఇందుకు కారణం షర్మిల. వైఎస్. కుమార్తె షర్మిల కుటుంబ వివాదాల కారణంగా ఫ్యామిలీకి దూరమయ్యారు. రాజకీయంగా జగన్ విభేదించిన కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా పీసీసీ పగ్గాలను చేపట్టారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ సహా కర్నాటక, ఢిల్లీకి చెందిన పలువురు కాంగ్రెస్ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. దీని ద్వారా వైఎస్ అసలైన వారసురాలని తానేనని చెప్పుకునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాడు వైఎస్ పనిచేశారని.. ఇప్పుడు తాము కూడా రాహుల్ గాంధీ కోసమే పని చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు.

వైఎస్ ఎపిసోడ్ లో జగన్ కాస్త ఇరకాటంలో పడ్డట్టు అర్థమవుతోంది. ఒకవైపు తండ్రికి అసలైన వారసుడిని తానేనని జగన్ చెప్పుకుంటున్నారు. తండ్రి బాటలోనే తాను నడుస్తున్నానని.. ఆయన బాటలోనే సంక్షేమానికి పెద్దపీట వేశానని భావిస్తున్నారు. కానీ మొదట్లో పోలిస్తే ఇప్పుడు వైఎస్ ను జగన్ పెద్దగా పట్టించుకోవట్లేదనే అపవాదును ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోదరి షర్మిల వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం, అది కూడా కాంగ్రెస్ పార్టీ తరపున కార్యక్రమం ఏర్పాటు చేయడంతో జగన్ కు మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. వైసీపీ మాత్రం అక్కడక్కడా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించింది. జగన్ ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. మొత్తానికి వైఎస్ ఫ్యామిలీల వారసత్వ పోరు తారస్థాయికి చేరిందని చొప్పొచ్చు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :