తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు సర్వేను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సామాజిక, ఆర్థిక వివరాలను సేకరిస్తున్నారు. ఉన్న ఆస్తులెన్ని అప్పులెన్ని, ఆదాయమెంత ఇంట్లో ఎంతమంది ఉంటారు. ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా ఇలా మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో కుటుంబ యమజాని, సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతిఒక్కరి ఫోన్ నంబరు, వారుచేసే వృతి, ఉద్యోగ వివరాలను తీసుకుంటున్నారు.
కుటుంబంలో ఎవరైనా విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఏ కారణంతో వెళ్లారనేది కూడా చెప్పాలి. ఉన్నత చదువు లేదా ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి లేదా ఇతర అవసరాలకు వెళ్లారా అని కుటుంబ యజమానిని గణకులు అడుగుతున్నారు. విదేశాల్లో యూకే, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు ఐరోపా దేశాలకు వెళ్లినట్లు చెబితే ఒక్కో దేశానికి ఒక ప్రత్యేక కోడ్ నమోదు చేస్తున్నారు. మరే దేశానికి వెళ్లినా ఇతర దేశం అనే కోడ్ నమోదు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఎందరు వలస వెళ్లారు. ఏ కారణంతో బయటకు వెళ్లారనే సమగ్ర సమాచారం సేకరించడానికి ఈ ప్రశ్నలు రూపొందించినట్లు తెలుస్తోంది.