RRR : రఘురామ కృష్ణరాజుకు విజయ సాయి రెడ్డి కంగ్రాట్స్..!! ఏంటి సంగతి..!?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. దీంతో ఆయన ఇవాళ లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ స్పీకర్ పవన్ కల్యాణ్.. రఘురామ కృష్ణరాజును సీటు దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి.. రఘురామ కృష్ణరాజుకు కంగ్రాట్స్ చెప్పారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రఘురామ కృష్ణరాజు కొన్నేళ్లుగా కంట్లో నలుసులాగా మారారు. 2019లో నరసాపురంనుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన రఘురామ కృష్ణరాజు.. ఆ తర్వాత కొంతకాలానికై ఆ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతో ఆయనపై దేశద్రోహం కేసు పెట్టింది జగన్ ప్రభుత్వం. అప్పటి నుంచి ఆయన్ను పలు రకాలుగా వేధించింది. కొన్నేళ్లపాటు ఆయన కనీసం తన నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు ఎన్నికల ముంగిట టీడీపీలో చేరి ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు.
వైసీపీని ఓడించడంలో రఘురామ కృష్ణరాజ పాత్ర కూడా మరువలేనిది. దాదాపు రెండేళ్లపాటు ఆయన రచ్చబండ పేరుతో సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. రఘురామ కృష్ణరాజుపై ఎన్ని విధాలుగా అణచివేత ధోరణి అవలంబించినా ఆయన మాత్రం వెనక్కు తగ్గలేదు. పైగా జగన్ బెయిల్ పైన కోర్టులో కేసులు వేశారు. ఇప్పటికీ అవి విచారణ జరుగుతున్నాయి. తనను వేధించిన పోలీస్ అధికారులపైన కూడా ఆయన ఫిర్యాదులు చేశారు. ఓవరాల్ గా రఘురామ కృష్ణరాజు వైసీపీని ముప్పతిప్పలు పెట్టారు.. పెడుతూనే ఉన్నారు. దీంతో రఘురామ కృష్ణరాజుపై వైసీపీ నేతలు కక్ష పెంచుకున్నారు. ఆయన ఎదురపడినా మాట్లాడకుండా వెళ్లిపోయేవారు.
రఘురామ కృష్ణరాజు వైసీపీ పట్ల అనుసరించిన విధానం చూసిన టీడీపీ నేతలు.. ఆయన స్పీకర్ అయితే బాగుంటుందనుకున్నారు. రఘురామ కృష్ణరాజును వేధించి విసిగించిన జగన్.. ఆయన్ను అధ్యక్షా అని పిలిస్తే చూడాలనుకున్నారు. ఇప్పుడు అలాంటి అవకాశమే వచ్చింది. కానీ జగన్ మాత్రం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. దీంతో ఆ ముచ్చట తీరుతుందో లేదో అనుకుంటున్నారు. ఆ మధ్య అసెంబ్లీ సమావేశాల్లో జగన్ తారసపడినప్పుడు రఘురామ కృష్ణరాజు పలకరించారు. అదే అప్పట్లో సెన్సేషన్ అయింది. ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి.. రఘురామ కృష్ణరాజును అభినందిస్తూ ట్వీట్ చేశారు. పదవికి వన్నె తేవాలని ఆకాంక్షించారు. పాత విషయాలు మర్చిపోవాలని సూచించారు. వాస్తవానికి ఢిల్లీలో రఘురామ కృష్ణరాజుపై విజయ సాయి రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని తుదివరకూ ప్రయత్నించారు. కానీ వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజును విజయ సాయి రెడ్డి అబినందిస్తూ ట్వీట్ చేయడంతో ఏంటి సంగతి అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది నేతలు.