ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. 48 గంటల్లోనే డబ్బు రిఫండ్
శ్రీకాకుళం జిల్లా ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి (దీపం-2) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని అందరం కలిసి పోరాడి కాపాడుకున్నామన్నారు. ఆడబిడ్డల కోసం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని, ఇంటిని సమర్థంగా నడిపించే శక్తి ఆడబిడ్డలకు ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 50 శాతం మంది ఆడబిడ్డలు ఉన్నారని, వారంతా ఆత్మగౌరవంతో బతకాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్న ఆయన.. గ్యాస్ సిలిండర్‌కు చెల్లించిన డబ్బు 48 గంటల్లోనే రిఫండ్ అవుతుందని చెప్పారు. ఈ డబ్బు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుందని వివరించారు. భవిష్యత్తులో ఈ గ్యాస్ సిలిండర్లకు అసలు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా చెయ్యడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినప్పటికీ తమ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.