మహారాష్ట్రలో జనసేనాని పవన్ ప్రచారం...
ఎన్డీఏ కూటమిలోని జనసేనతో బీజేపీ అన్యోన్యబంధం మరింత బలోపేతమవుతోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా జనసేనానినే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో దింపుతోంది. నవంబర్ 16,17వ తేదీల్లో పవన్.. మరాఠా గడ్డపై ప్రచారం నిర్వహించనున్నారు.ముఖ్యంగా తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పవన్ ప్రచార పర్వం సాగనుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ సారథ్యంలోని కూటమి ప్రచారంలో దూసుకుపోతుంది.
ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్‌ను దించుతోంది భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి తరుఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్‍ను కోరింది బీజేపీ. బీజేపీ అభ్యర్థన మేరకు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. బీజేపీ ఆహ్వానం మేరకు నవంబర్ 16,17 తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ముఖ్యంగా మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ప్రచారం షెడ్యూల్ ఖరారైంది.
బీజేపీ జాతీయ స్థాయి, మహారాష్ట్ర నాయకులు జనసేన నాయకులతో చర్చల అనంతరం పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఖరారైనట్లు జనసేన పార్టీ వెల్లడించింది.ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఐదు బహిరంగ సభల్లో, రెండు రోడ్ షోల్లో పాల్గొంటారు. మొదటి రోజు మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 16వ తేదీ ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు. లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 6గంటలకు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు.
ఇక నవంబర్ 17వ తేదీ విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆ రోజు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. కాగా, 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర శాసనసభకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు.