ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : ఎన్టీఆర్ నట విశ్వరూపం 'దేవర'

రివ్యూ : ఎన్టీఆర్ నట విశ్వరూపం 'దేవర'

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు : ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్
నటీనటులు : ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్, సైఫ్ అలీ ఖాన్,  శ్రీకాంత్,  ప్రకాష్ రాజ్,  షైన్ టామ్ చాకో, శృతి మరాఠే,  న‌రైన్ తదితరులు నటించారు.
సంగీత దర్శకుడు : అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు
ఎడిటింగ్‌ : శ్రీక‌ర్ ప్ర‌సాద్, ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ : సాబు శిరిల్
నిర్మాత : మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్
దర్శకుడు : కొరటాల శివ
విడుదల తేదీ : 27.09.2024
నిడివి : 2 ఘంటల 58 నిమిషాలు 

ఫ్యాక్షనిజం కుటుంబం నుంచి వచ్చిన యువకుడి కథతో  అరవింత సమేత‌ చిత్రంలో రక్తాన్ని ఏరులైనా పారించాడు ఎన్టీర్ (Jr NTR). అది రాయలసీమ గడ్డ అయితే, ఈ సారి రక్తపు నదులను ప్రవహించి సముద్రాన్ని ఎర్రగా మార్చాడు దేవర చిత్రంతో  ఎన్టీఆర్. కొరటాల శివ,(Koratala Shiva)  ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సక్సెస్ ఫుల్ మూవీ జనతా గారేజ్, మరో సారి వీరి కాంబి లో యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా 'దేవర'. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, బ్యానర్ లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై  మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో  శ్రీ దేవి తనయ జాన్వీకపూర్‌ కపూర్ (Jhanvi Kapoor) హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కావడం విశేషం. పైగా సైఫ్ అలీఖాన్‌ (Saif Ali Khan ) ప్రతినాయకుడు. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు  తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. మరి ఇన్ని హైలెట్స్ వున్నా దేవర ప్రేక్షకుల మన్ననలు పొందిందా లేదా (Devara Review in Telugu) సమీక్షలో చూద్దాం. 

కథ :

1980-90 దశకం నేపథ్యంలో జరిగే ఈ ఫిక్షన్ కథ‌..దేవర.  ఎర్ర సముద్రం ప్రాంతంలో తూర్పు పడమర ఉత్తర దక్షిణ అనే నాలుగు ఊర్లు ఉంటాయి. అందులో దేవర (ఎన్టీఆర్) ఓ ఊరికి అండగా ఉంటాడు. మరో ఊరికి భైర (సైఫ్ అలీ ఖాన్) పెద్దగా ఉంటాడు. మిగిలిన రెండు గ్రామాల వారితో కలిసి దేవర, భైర సముద్రం పై వచ్చే షిప్పుల్లో దోపిడీ చేస్తుంటారు.  శివమ్ (అజయ్) అనే పోలీసు అధికారి యతి అనే గ్యాంగ్ స్టార్‌ని పట్టుకోవడంతో సినిమా మొదలౌతుంది. ఏపీ తమిళనాడు బోర్డర్‌లో అక్రమాలకు తెరతీస్తున్న గ్యాంగ్ స్టార్ యతిని పట్టుకోవడానికి వెళ్తాడు శివమ్. అనూహ్యంగా అతనికి సింగప్ప (ప్రకాష్ రాజ్) పరిచయం అవుతాడు. అతని ద్వారా సముద్రపు దొంగ దేవర తెగువ గురించి కథగా శివమ్ కి చెపుతుంటాడు. అయితే  ఎర్రసముద్రానికి ఎదురెళ్లి.. తాము చేసే దొంగతనం వల్ల ఆ ఊరికి.. దేశానికి జరుగుతున్న నష్టాన్ని తెలుసుకున్న దేవర.. ఒక సంఘటనతో తన మనసు మార్చుకుంటాడు. తన ముఠా సభ్యుల్ని లూటీలు చేయొద్దని హుకూం జారీ చేస్తాడు. అది నచ్చని భైరా దేవరకు ఎదురుతిరుగుతాడు. భైరా, దేవర వైరం ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ క్రమంలో దేవర కొడుకు వర (చిన్న ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? అతను కథను ఏ విధంగా మలుపు తిప్పాడు? ఇందులో తంగం (జాన్వీ కపూర్) పాత్ర ఏంటి? అన్నదే ‘దేవర’ అసలు కథ. భయం పోవాలంటే దేవుడి కథ వినాలా.. భయం అంటే ఏంటో తెలియాలంటే ఈ ‘దేవర’ కథ వినాలా. మరి ఈ మిగతా  దేవర కథ ఎలా ఉందో థియేటర్లలో చూద్దాం.

సాంకేతికవర్గం పనితీరు :

కొరటాల సినిమాల్లో మెసేజ్ మస్ట్. ఇందులో కూడా సందేశం ఉంది. మనిషి బతకడానికి ధైర్యం ఉండాల్సిందే.. అయితే అది బతకడానికే తప్పతే ఎదుటి మనిషిని చంపడానికి కాదు అన్న కోణంలో ‘దేవర’ కథను అల్లాడు కొరటాల. ఎర్ర సముద్రంపై తప్పు చేయాలన్న ధైర్యాన్ని అణచివేసే భయంగా ‘దేవర’ను చూపించారు. కాన్సెప్ట్ ఇంట్రస్టింగ్‌గానే అనిపిస్తుంది కానీ.. ఎర్రసముద్రం చుట్టూ అల్లిన కథలో.. సముద్రానికి అలలు మాదిరిగానే ‘దేవర’ కథ కూడా పడుతూ లేస్తూ సాగింది. దేవర ఎంట్రీ తరువాత వేగం పుంజుకుని.. ఇంటర్వెల్ సీన్‌తో హైప్ తీసుకొచ్చారు. సముద్రంలో అండర్ వాటర్ సీక్వెన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్‌.. ఆయుధాల్ని దోపిడీ చేసే సీన్లు.. ఆకట్టుకుంటాయి. రత్నవేలు విజువల్ ట్రీట్ సినిమాకి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా సముద్రంలో అండర్ వాటర్ సీక్వెన్సులకు పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్ నిడివిని మూడు గంటల పాటు పెంచినట్టే అనిపిస్తుంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కత్తెరేయాల్సిన సీన్లు చాలానే కనిపిస్తాయి. అనిరుధ్ మ్యూజిక్‌‌పై సందేహాలు కలిగాయి కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్‌తో న్యాయం చేశాడు. చుట్టమల్లే సాంగ్ వినడానికే కాదు.. చూడ్డానికి కూడా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్‌కి అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా హెల్ప్ అయ్యింది. నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

విశ్లేషణ :

తనని నమ్ముకున్న తెగ కోసం ఓ తండ్రీకొడుకులు చేసిన ధర్మయుద్ధమే ‘దేవర’.అయితే సినిమా మొత్తం చూసిన తరువాత.. దేవరను రెండు పార్ట్‌లుగా కాకుండా.. ఒక్క పార్ట్‌తోనే కొరటాల కంప్లీట్ చేసి ఉంటే.. రిజల్ట్ మరో విధంగా ఉండేదేమో అనిపించకమానదు. పైగా.. ఫస్ట్ పార్ట్‌లో ట్విస్ట్ చూసిన తరువాత.. కొరటాలకి బాహుబలి-కట్టప్ప సీన్ గుర్తుకురాలేదా? లేదంటే.. ఆ సినిమాకి వచ్చిన హైప్‌తోనే ‘దేవర’ పార్ట్ 2 కోసం ఎదురుచూస్తారని కావాలనే పెట్టారా అనే డౌటానుమానం కలుగుతుంది. ఫస్టాఫ్‌ని రేసీగా నడిపించిన కొరటాల.. సెకండాఫ్‌‌కి వచ్చేసరికి డల్ అయ్యారు. ఏదో చెప్పాలనుకుంటున్నాడు.. కానీ అక్కడ ఇంకేదో అవుతుందే అనేట్టుగా అనిపిస్తాయి కొన్నిసీన్లు. విజువల్ వండర్ గా సాగిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పవర్ ఫుల్ నటన, కొరటాల దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ, కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌.. సీనియర్ ఎన్టీఆర్‌ని ‘దేవర’ కథ చెప్పు నాన్నా అని అంటాడు. ‘‘తరువాత తరానికి చెప్పుకునే గొప్ప కథ కాదురా మీ నాయన కథ’’ అని అంటాడు సీనియర్ ఎన్టీఆర్. కాబట్టి దేవర.. తరువాత తరానికి చెప్పుకునేటంత గొప్ప కథ కాదు కానీ.. చెత్త కథ అయితే మాత్రం కాదు. హైఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమాకు వెళ్తే నిరాశ తప్పదు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :