Dharmana : జగన్‌కు ధర్మాన హ్యాండ్ ఇవ్వబోతున్నారా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) ఓ వెలుగు వెలిగిన కుటుంబాల్లో ధర్మాన (Dharmana) ఫ్యామిలీ ఒకటి. అన్నదమ్ములిద్దరూ మంత్రి పదవులు అనుభవించారు. శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో అన్నీ తామై వ్యవహరించారు. జిల్లా నేతలు, కార్యకర్తలంతా ధర్మాన సోదరులు చెప్పినట్లే నడుచుకునే వారు. వాళ్లకు పార్టీ అధినేత జగన్ (YS Jagan) కూడా సముచిత ప్రాధాన్యం ఇచ్చి గౌరవించారు. అయితే ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. కేడర్ మొత్తం నిరాశలో కూరుకుపోయింది. వాళ్లతో పాటు ధర్మాన సోదరులు కూడా పార్టీని పట్టించుకోవడం మానేశారు. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నారనే టాక్ జిల్లాలో జోరుగా వినిపిస్తోంది.
ధర్మాన ప్రసాద్ రావు (Dharmana Prasada Rao) సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ కు అనుచరుడిగా ఉన్నారు. వైఎస్ (YSR) కేబినెట్లో కూడా మంత్రిగా పని చేశారు. అనంతరం వైసీపీ చేరారు. జగన్ అధికారంలోకి రాగానే మొదట ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishna Das) ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు. అనంతరం ధర్మాన ప్రసాదరావును కేబినెట్లోకి తీసుకుని రెవిన్యూ శాఖ బాధ్యతలు ఇచ్చారు. దీంతో ధర్మాన సోదరులకు పార్టీలో మంచి పట్టు దొరికింది. జిల్లాలో కూడా హవా నడిపించగలిగారు. కేడర్ ను ఏకతాటిపైకి తీసుకొచ్చి కింజరాపు ఫ్యామిలీని ధీటుగా ఎదుర్కోగలిగారు.
ఇక పార్టీ ఓడిపోయిన తర్వాత జిల్లాలో పార్టీ ఆపీసును క్లోజ్ చేశారు. నియోజకవర్గ కార్యాలయాన్ని కూడా మూసేశారు. మంత్రి క్యాంప్ ఆఫీసుకు కూడా తాళాలు వేసేశారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఆఫీసు కూడా లేకుండా పోయింది. దీంతో పార్టీ కేడర్ అంతా ధర్మాన సోదరులను నిందిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగినవాళ్లు ఇప్పుడు పార్టీని పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. దీంతో ధర్మాన కృష్ణదాస్ మాత్రం అడపాదడపా మీడియా ముందుకొస్తున్నారు. పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు.
ధర్మాన ప్రసాదరావు మాత్రం పార్టీ కార్యక్రమాల జోలికి వెళ్లట్లేదు. ఇంటి గడప దాటట్లేదు. కేడర్ ను కూడా కలవట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో ఉంటే భవిష్యత్ ఉండదనే ఆలోచనకు ప్రసాదరావు వచ్చినట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం త్వరలోనే ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. టీడీపీలో (TDP) చేరాలని ఆసక్తి చూపించినా ఇప్పటికే కింజరాపు ఫ్యామిలీ బలంగా ఉండండతో అక్కడ ఇమడడం కష్టమనే భావనలో ధర్మాన ఉన్నట్టు సమాచారం. అందుకే జనసేన (Janasena) అయితే తమకు తగిన ప్రాధాన్యత దొరుకుతుందని ఆలోచినట్టు తెలుస్తోంది. అయితే ధర్మాన జారిపోకుండా కృష్ణదాస్ ద్వారా జగన్ మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం.