ASBL Koncept Ambience
facebook whatsapp X

Dodda Anji Reddy: జగన్ మెచ్చిన ఈ దొడ్డా అంజిరెడ్డి ఎవరు..!?

Dodda Anji Reddy: జగన్ మెచ్చిన ఈ దొడ్డా అంజిరెడ్డి ఎవరు..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టింది. ఆ పార్టీ అధినేత జగన్ (YS Jagan) జిల్లాలవారీగా సమీక్షలు చేసుకుంటూ అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అలాగే రాష్ట్రస్థాయిలో కీలక పదవులను కొత్త వ్యక్తులకు కట్టబెడుతున్నారు. పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటూ ఉండడంతో యువతరాన్ని ప్రోత్సహించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సోషల్ మీడియా విబాగం ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ గా దొడ్డా అంజిరెడ్డిని (Dodda Anji Reddy) నియమించారు.

వాస్తవానికి గత రెండేళ్లుగా వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని (YSRCP Social Media) సజ్జల భార్గవ్ రెడ్డి (Sajjala Bhargav Reddy) చూస్తున్నారు. సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) కుమారుడిగా ఆయన సుపరిచితులు. అయితే అనతికాలంలోనే ఆయన పార్టీపై పట్టు సాధించారు. సోషల్ మీడియాను (Social Media) తన చెప్పుచేతల్లో ఉంచుకుని గట్టిగానే పనిచేశారు. అయితే ఆయన వ్యూహాలు వర్కవుట్ కాలేదు. పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అంతకుముందు సోషల్ మీడియా విభాగాన్ని గుర్రంపాటి దేవేందర్ రెడ్డి (Gurrampati Devendar Reddy) చూసేవారు. ఆయన విజయసాయి రెడ్డికి (Vijayasai Reddy) అత్యంత సన్నిహితులు. విజయసాయి రెడ్డిని సైడ్ ట్రాక్ చేసిన తర్వాత దేవేందర్ రెడ్డిని తప్పించి సజ్జల భార్గవ్ రెడ్డికి (Sajjala Bhargav Reddy) సోషల్ మీడియాను అప్పగించారు జగన్.

కానీ ఇప్పుడు సోషల్ మీడియా బాధ్యతలు చేపడుతున్న దొడ్డా అంజిరెడ్డి పార్టీలో పెద్దగా ఎవరికీ తెలీదు. ఈయన పేరు ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో చాలా మంది ఈయనెవరు.. ఎవరి మనిషి.. ఏం చేస్తుంటారు.. లాంటివి ఆరా తీయడం మొదలు పెట్టారు. అందులో భాగంగా తేలిందేంటంటే.. ఆయన విజయవాడ తూర్పు (Vijayawada East) నియోజకవర్గానికి చెందిన నేతగా గుర్తించారు. జిల్లా విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పని చేశారు. పార్టీ ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా హడావుడి చేయడం ఈయన స్పెషాలిటీ. విజయవాడలో పెద్ద ఎత్తున బ్యానర్లు కడుతుంటారని తెలిసింది.

విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ (Devineni Avinash) కి దొడ్డా అంజిరెడ్డి సన్నిహితుడని కొందరు చెప్తుంటారు. అయితే అంజిరెడ్డికి సోషల్ మీడియాపై ఏమాత్రం పట్టులేదు. ఈయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. అయినా జగన్ ఈయనకు పదవిని కట్టబెట్టారు. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో పని చేస్తున్న వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నట్టు సమాచారం. వాస్తవానికి సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడే చాలా మంది ఆయన వర్గీయులంతా తప్పుకున్నారు. ఇప్పుడు అంజిరెడ్డి రాకతో మిగిలినవాళ్లు కూడా గుడ్ బై చెప్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే పాతనీరు పోయినప్పుడు కొత్తనీరు రావడం సహజమే కదా. అలాగే అంజిరెడ్డి కూడా తన టీంను తెచ్చుకుని పనిచేస్తారని చెప్పుకుంటున్నారు. మరి కొత్త బాధ్యతలను కొత్త వ్యక్తి ఎలా నెరవేరుస్తారనేది వేచి చూడాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :