ట్రంప్ విజయం - ఇండియాకి ఎంతో మేలు!!
నేను చేస్తున్న వృత్తిని బట్టి ఒక రాజకీయ పార్టీ కి లేదా నాయకుడికి మద్దతుగా లేదా వ్యతిరేకంగా నా వ్యక్తిగత అభిప్రాయాలు సాధారణంగా చెప్పను. కానీ ఎన్నికల వేళ పరిస్థితులను విశ్లేషణ చేయడం జరుగుతూనే ఉంటుంది. 2016 లో డోనాల్డ్ ట్రంప్ మొదటి సారి పోటీ చేస్తున్న సమయం లో ట్రంప్ గెలుస్తారు అని గట్టిగా నమ్మాను.. రాసాను... హైదరాబాద్ లో ఓ ఛానల్ డిబేట్ లో పాల్గొని చెప్పాను కూడా. అలాగే 2020 లో కూడా ట్రంప్ గెలుస్తాడు అని అనుకొన్నాను. టీవీ స్టూడియో లలో కూడా ఆ మాటే చెప్పాను. ఈ సారి పరిస్థితి కూడా కొంచెం అలాటిదే. జులై 2024 వరకు బైడెన్ - ట్రంప్ ల మధ్య పోటీ ఉన్నప్పుడు ట్రంప్ కు కేక్ వాక్ విక్టరీ అని అనుకున్న అందరిలో నేనూ ఒకడిని. కానీ ఆగస్టు 2024 లో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడం, కమల హారిస్ పోటీలోకి రావడం, ఆవిడా ఒక 5-6 వారాలలో అందరి మద్దతు సంపాదించటంలో, పెద్దపెద్ద విరాళాలు సేకరించటం లో గొప్ప ప్రోగ్రెస్ చూపించి ట్రంప్‌కి గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. అమెరికా మీడియా కూడా ట్రంప్ - హారిస్ మధ్య పోటీ ‘నువ్వా?.. నేనా?’ అన్నట్టు ఉందని, సర్వేలలో 1 నుండి 2 శాతం వ్యత్యాసం కనిపిస్తోంది అని రాయడం మొదలెట్టారు. ఇంకా ఇండియా మీడియా ఎప్పటి లాగే డెమోక్రాటిక్ పార్టీని సమర్థిస్తూ, కమల హారిస్‌ని భారతీయ సంతతిగా చెపుతూ బానే సపోర్ట్ చేసింది.
తెలుగు టైమ్స్, 1 నవంబర్ 2024 సంచిక లో ‘‘గెలిచేదెవరు?’’ అంటూ అనేక మందితో మాట్లాడి, వారి అభిప్రాయలతో కవర్ స్టోరీ రాయడానికి నేను చేసిన ఎనాలిసిస్‌లో ట్రంప్ గెలుస్తారు అన్న పాయింట్‌తో పాటు ట్రంప్- హారిస్ లలో ఎవరు వస్తే ఇండియాకి ఉపయోగం అనే విషయం కూడా విశ్లేషణ చేశాను.
ట్రంప్‌కి మొదటి నుంచి టెర్రరిస్ట్‌లు అన్నా, ముస్లిం దేశాలు అన్నా, చైనా దేశం అన్నా కోపం. ట్రంప్ చాలా దృఢమైన వ్యక్తిత్వం (కొంచెం చంచల స్వభావం వున్నా)తో నిర్ణయాలు తీసుకోగలరు. వాటిని అంతే దృఢ నిశ్చయంతో అమలు పరచగలరు. ఆ విధంగా ఇండియాకి ప్రస్తుతం వున్న పొరుగు దేశాల నుంచి వచ్చే బోర్డర్ ఇష్యూస్ తప్పకుండా తగ్గుతాయి. ఎందుకంటే ట్రంప్ అధ్యక్షుడుగా వున్న ఆమెరికా పాకిస్తాన్‌కి, బంగ్లాదేశ్‌కి అవసరానికి మించి డెమోక్రాటిక్ ప్రభుత్వం చేసినట్టుగా సహాయం చెయ్యదు. ప్రస్తుతం ప్రపంచంలో 5వ బిగ్గెస్ట్ ఎకానమీ వున్న ఇండియా 3వ పోజిషన్‌లోకి ఎదగటానికి ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అభివృద్ధి పథంలో ఇండియాకి అడ్డుపడే దేశం చైనా.. ఇప్పుడు ట్రంప్ నాయకత్వంలో వున్న ఆమెరికా తప్పని సరిగా చైనాని కొంచెం కట్టుదిట్టం చేస్తుందని అనుకోవడంలో తప్పు లేదు. చివరగా రిపబ్లికన్ ప్రభుత్వం ఉండగా లీగల్‌గా అమెరికా వెళ్లాలనుకొనే స్టూడెంట్‌లకుగాని, ఉద్యోగ స్తులకు గాని తగిన ప్రోత్సాహం కల్పిస్తుంది. హెచ్ 1 మీద వెళ్లిన ఉద్యోగస్తుల భార్యలకు (హెచ్ 4 వీసా) కూడా ఉద్యోగం చేసే అవకాశం కూడా వుంది. ఎంప్లొయీస్ నుంచి ఎంట్రప్రేనేర్‌గా ఎదుగుదామను కొనే వారికి ట్రంప్ ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతం చెబుతుంది కూడా...ఆ విధంగా ట్రంప్ రావడం మనకు మంచిదే అంటాను. ఎన్నికల ఫలితాల సమయంలో టీవి డిబెట్‌లలో కూడా ఇదే చెప్పాను.
- చెన్నూరి వెంకట సుబ్బారావు, ఎడిటర్, తెలుగుటైమ్స్