గంజాయి, డ్రగ్స్ పై కూటమి ఉక్కు పాదం.. ఈగల్ తో ఇది సాధ్యమేనా?
ఆంధ్ర రాష్ట్రంలో చాప కింద నీరులా ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న డ్రగ్స్ గురించి అందరికీ తెలిసిందే. వైసీపీ హయాంలో ఓ రకంగా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి అన్న విమర్శలు ఎన్నో వచ్చాయి. అంతేకాదు మన దేశం మొత్తం మీద ఎక్కడ ఏ మూల డ్రగ్స్ దొరికిన.. వాటి మూలాలకు ఏపీతో లింకులు ఉండడం పై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని వెనక కచ్చితంగా ఎవరు ఉన్నారు అన్న విషయం ఇప్పటికీ రుజువు కాలేదు. ఒకపక్క కూటమి ప్రభుత్వం ఇదంతా వైసీపీ నిర్వాకం అంటే.. వైసీపీ కూటమిపై నిందలు వేస్తోంది. వీటన్నిటి మధ్యలో డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపడానికి ఆంధ్ర ప్రభుత్వం ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలో గంజాయి అమ్మే వారి కుటుంబాలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు మొత్తం నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం సంచలమైన నిర్ణయాన్ని తీసుకుంది.
తాజాగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ గా ఇప్పటివరకు పిలవబడే వాటిని ఈగల్ అనే పేరు మారుస్తున్నట్టు లోకేష్ ప్రకటించారు. సచివాలయాల పరిధిలో ఉన్న పదిమంది సభ్యులతో ఈగల్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీలో మహిళా సంఘాలతో పాటు ఆశ వర్కర్లు కూడా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారట. స్కూల్స్, కాలేజెస్ పరిధిలో ఉన్న సచివాలయాలలో ఈ ఈగల్ టీం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
గత కొద్ది కాలంగా మహిళలపై జరుగుతున్న అనేక దారుణాలకు గంజాయి, డ్రగ్స్ మూల కారణమని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మన రాష్ట్రంలో వీటి వాడకాన్ని అరికట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేయడంతో పాటు కొన్ని కఠినమైన నిర్ణయాలను కూడా తీసుకుంటుంది. ఈగల్ తో ఇటు గంజాయి, అటు డ్రగ్స్ పై నిఘాను పెంచి.. సమూలంగా వాటిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి నడుం బిగించింది కూటమి.