అమిత్ షా, రాహుల్ గాంధీలపై ఫిర్యాదులు.. నడ్డా, ఖర్గేల వివరణ కోరిన ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖలు అందాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు కేంద్రమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈ లేఖలు రాసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులపై ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు వివరణ ఇవ్వాలని ఆయా పార్టీల అధ్యక్షులను ఈసీ ఆదేశించింది.
రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ప్రసంగంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని బీజేపీ ఫిర్యాదు చేయగా.. అమిత్ షా కూడా కోడ్ను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేతలపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆయా పార్టీల నేతలను కోరింది. అలాగే, తమకు అందిన ఫిర్యాదులను కూడా ఇరుపక్షాలకు అందించింది. ఇటీవల లోక్సభ ఎన్నికల సందర్భంగా స్టార్ క్యాంపెయినర్లకు తాము చేసిన సూచనలను కూడా ఈసీ తమ లేఖలో ప్రస్తావించింది. జాతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఆదర్శంగా ఉండాలని, సమాజంలోని ఐక్యతను చెడగొట్టేలా వ్యాఖ్యలు చెయ్యకూడదని ఈసీ సూచించింది.