అరగంటలో నచ్చినదేశానికి.. మస్క్ earth to starship టెక్నాలజీ..
ఎలన్ మస్క్.. ప్రయోగాలకు మారుపేరు. గెలిచామా ఓడామా కాదన్నయ్యా.. అనుకున్నది సాధించామా .. లేదా అన్నది మస్క్ శైలి. తొలుత ట్రంప్ పేరు ఎత్తితేనే మండిపడే మస్క్.. తర్వాత ట్రంప్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. అంతేకాదు.. అమెరికా చట్టాలను సైతం తోసిరాజంటూ.. ప్రచారంలో మిలియన్ల డాలర్లు సైతం పంపిణీ చేశారు మస్క్. అనుకున్నది సాక్షాత్కారమైంది. తాను గెలవడంతో మస్క్ కు పెద్దపీట వేశారు ట్రంప్. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచాక.. ఆయన సన్నిహితుడు ఎలన్ మస్క్ నూతనోత్సాహంతో కనిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో కీలక పదవిని ఆయనకోసం కేటాయించారు.
రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉంటూనే, మస్క్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ ప్రయాణ రంగంలో ఒక విప్లవాత్మక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. అదే స్టార్ షిప్ రాకెట్. దీని సాయంతో ప్రయాణికులు.. ప్రపంచంలోని ఏ దేశానికైనా 30 నుంచి 40 నిమిషాల్లోపు చేరుకోవచ్చు. అమెరికా టు ఇండియా 30 నిమిషాలే జర్నీ.. మరి లాస్ ఏంజెల్స్ టు టొరంటో 24 మినిట్స్, ఢిల్లీ టు శాన్ ఫ్రాన్సిస్కో 30 మినిట్స్.. న్యూయార్క్ టు షాంగై, హాంకాంగ్.. 30 మినిట్స్ లో చేరుకోవచ్చు. గంటలకొద్దీ సమయం పట్టే ప్రయాణాలను మస్క్.. నిముషాల్లోకి తెస్తున్నారన్నమాట.
అంటే ప్రయాణం నిముషాల్లోకి మారనుంది. ఈ అసాధ్యాన్ని ఎర్త్ టు స్టార్ షిప్ రాకెట్ ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు మస్క్. ఇది ఎర్త్ టు ఎర్త్ స్టార్‌షిప్ రాకెట్. దాదాపు 395 అడుగుల పొడవు ఉంటుంది. స్టార్‌షిప్ రాకెట్‌లో వెయ్యిమంది ప్రయాణించవచ్చు. భూ కక్ష్య దాకా వెళ్లి, తర్వాత గమ్యస్థానం చేరుతుంది. దీంతో నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుంది. సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి విమానం ద్వారా చేరుకోవాలంటే కనీసం 16 గంటల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ రాకెట్ టెక్నాలజీతో ఈ ప్రయాణ వ్యవధి 30 నిమిషాలకు తగ్గిపోతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై పనులు జరుగుతున్నాయి. మరి కొన్నేళ్లలో ఇది ప్రజలకు అందుబాటులోకి రానుందని చెబుతున్నారు.