ASBL Koncept Ambience
facebook whatsapp X

Farm House Politics: ఫాంహౌస్‌ల చుట్టూ తెలంగాణ రాజకీయం..!!

Farm House Politics: ఫాంహౌస్‌ల చుట్టూ తెలంగాణ రాజకీయం..!!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చాక అక్రమ కట్టడాలపై జులం విదిలిస్తోంది. ముఖ్యంగా హైడ్రా (HYDRA) పేరుతో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. దానికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. దీంతో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో చెరువులు, కుంటలు, కాలువలను కబ్జా చేసిన వాళ్లపై కొరడా ఝళిపిస్తోంద. అక్రమ కట్టడాలని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తోంది. అయితే ఇది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. నగర శివార్లలోని ఫాంహౌస్ (Farm House) లన్నీ బడాబాబులకు చెందినవే. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ఫాంహౌస్ లున్నాయి. ముందు మీది కూల్చాలంటే మీది కూల్చాలంటూ సవాళ్లు విసురుకుంటున్నారు నేతలు.

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చెరువులు, కాలువలను ఆక్రమించిన అక్రమ కట్టడాలను కూల్చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేశారు. సినీనటుడు అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) చెందిన ఎన్-కన్వెన్షన్ (N-Convention) ను కూల్చేసినప్పుడు పెద్ద సంచలనమే అయింది. ఆ తర్వాత కూడా హైడ్రా పలు కట్టడాలను కూల్చేసింది. అయితే విపక్షాలకు చెందిన వాటిని, పేదలకు చెందినవాటిని మాత్రమే హైడ్రా కూల్చేస్తోందని.. అధికార పక్ష నేతల ఫాంహౌస్ ల జోలికి అధికారులు వెల్లట్లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది.

తమ ఫాంహౌస్ లు కూల్చేయబోతున్నాం కాబట్టి బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) పేదలను అడ్డం పెట్టుకుని రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డికి (Sabitha Indra Reddy) 3 ఫాంహౌసులున్నాయని.. వాటిని కూల్చాలా వద్దా.. అని ప్రశ్నించారు. కేటీఆర్ (KTR), హరీశ్ రావుల (Harish Rao) ఫాంహౌస్ లను కూడా ప్రస్తావించారు. అలాగే తమ పార్టీకి చెందిన కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao) ఫాంహౌస్ ను కూడా కూల్చాలా వద్దా అని ప్రశ్నించారు. పార్టీలతో సంబంధం లేకుండా అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూల్చేస్తామని.. ఇందులో వెనక్కు తగ్గేదే లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఓ లేఖ రాశారు. తన ఫాంహౌస్ నిబంధనలు విరుద్ధంగా ఉంటే మార్కింగ్ చేయాలని.. తానే దగ్గరుండి కూల్చేస్తానని కోరారు. హైడ్రాతో పాటు మూసీ సుందరీకరణను పూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అలాగే మండలిపక్ష నేత పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahendar Reddy) కూడా తన ఫాంహౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని.. వచ్చి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. తన ఫాంహౌస్ FTL పరిధిలో లేదని అధికారులు చెప్పారని.. ఒకవేళ ఉందని తేలితే తానే కూల్చేస్తాన్నారు. మరోవైపు తనకు మూడు ఫాంహౌస్ లు ఎక్కడున్నాయో రేవంత్ రెడ్డి  చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. మరోవైపు కూకట్ పల్లిలో బీఆర్ఎస్ నేతలు ఎవరైనా చెరువులు, నాలాలను ఆక్రమించి ఉంటే చెప్పాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇలా తెలంగాణ మొత్తం ఫాంహౌస్ ల చుట్టూనే రాజకీయం నడుస్తోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :