రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ అరెస్ట్!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో.. గత ప్రభుత్వ హయాంలో ఆయనను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసినట్లు సీఐడీ అధికారులపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముఖ్యంగా సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విజయపాల్ విచారణకు హాజరవ్వాల్సి వచ్చింది. సాయంత్రం వరకు ఆయన్ను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు, చివరకు విజయపాల్‌ను అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారిగా ఉన్నారు.
అంతకుముందు నవంబరు 13న కూడా పోలీసుల ఎదుట విజయపాల్ విచారణకు హాజరయ్యారు. కానీ పోలీసులకు ఎలాంటి వివరాలు లభించలేదు. మంగళవారం విచారణ తర్వాత కొన్ని ఆధారాలు లభించడంతో ఆయన్ను అరెస్ట్ చెయ్యడం జరిగింది. ఇదే క్రమంలో విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అయితే విజయపాల్ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. దీంతో ఆయన అరెస్ట్‌కు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది.