తానా ఫౌండేషన్ లో నిధుల గోల్ మాల్
అమెరికాలోని తెలుగు కమ్యూనిటికీ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు సేవలందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లోని కీలక విభాగమైన తానా ఫౌండేషన్ లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు బోర్డ్ సభ్యులు గుర్తించారు. దాదాపు 3,041,000 డాలర్ల నిధులు పక్కదోవ పట్టినట్లు బోర్డ్ సభ్యులు కనుగొన్నారు. ప్రస్తుతం ఫౌండేషన్ కు అధ్యక్షులుగా ఉన్న శశికాంత్ వల్లేపల్లి ఫౌండేషన్ లో నిధులు తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించి విచారణ చేసినప్పుడు ఈ అవకతవకలు బయటపడింది. దీంతో బోర్డ్ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టింది.
గత ఫౌండేషన్ పాలకవర్గంలో అధ్యక్షులుగా ఉన్న వెంకటరమణ యార్లగడ్డ, అప్పటి ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు ఇందుకు బాధ్యులని బోర్డ్ భావిస్తోంది. ఇందులో భాగంగా చేసిన విచారణలో శ్రీకాంత్ పోలవరపుకు చెందిన కంపెనీకి ఫౌండేషన్ నిధుల మళ్ళింపు జరిగినట్లు గుర్తించింది. దీంతో వారిద్దరినీ విచారించాలని బోర్డ్ భావించి ఈ మేరకు వారికి షోకాజ్ నోటీసులను జారీ చేసింది. వారిపై వచ్చిన అభియోగాలకు బోర్డ్ సమావేశానికి హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఈమేరకు వారికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ వారు వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలో ఆలోచిస్తామని బోర్డ్ సభ్యుడు ఒకరు చెప్పారు.