ASBL Koncept Ambience
facebook whatsapp X

ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్..!?

ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్..!?

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలు దాటింది. ఈ మధ్యకాలంలో పలువురు అధికారులు, ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో నియమితులైన పలువురు తమ పదవులకు రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. సహజంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు పాత ప్రభుత్వం ద్వారా నియమితులైన వాళ్లు రాజీనామా చేసి గౌరవంగా తప్పుకుంటూ ఉంటారు. అయితే మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి మాత్రం ఆ పని చేయలేదు. పైగా ప్రస్తుత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టబద్ద సంస్థ. కేంద్రస్థాయిలో జాతీయ మహిళా కమిషన్ పని చేస్తుంటుంది. అలాగే రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి మహిళా కమిషన్లు ఉంటాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పని చేయాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా పనిచేశారు. ఆమె ఎన్నికల ముందు ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఈ ఏడాది మార్చిలో రాజీనామా చేశారు. ఆమెకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. అది వేరే విషయం. అయితే వాసిరెడ్డి పద్మ స్థానంలో గజ్జెల వెంకట లక్ష్మిని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఈ ఏడాది జూన్ లో ప్రభుత్వం మారింది. వైసీపీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మాత్రం తనకు 2026 వరకూ పదవీకాలం ఉందని.. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అంతటితో ఆగకుండా ఆవిడ చంద్రబాబు ప్రభుత్వంపైనే విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. గుడ్లవల్లేరు కాలేజీలో సీసీ కెమెరాల అంశంలో పోలీసు విచారణకు విరుద్ధంగా ఆమె మాట్లాడారు. అంతేకాకు.. ఈవీఎంలలో అవకతవకల వల్లే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు.. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవి నుంచి వైదొలగాల్సిందిగా తనపై ఒత్తిడి చేస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పైగా తమకు జీతభత్యాలు ఇవ్వట్లేదని ఆరోపించారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాలపై ఆమెకు జీతభత్యాలు ఫిక్స్ చేసి నెలనెలా చెల్లిస్తూ వస్తోంది.

మొత్తానికి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. ఆమె గతంలో చంద్రబాబు, లోకేశ్, పంచుమర్తి అనురాధ తదితరులపై అసభ్య పదజాలంతో దూషించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయినా ఆమెపై చర్యలు తీసుకోవట్లేదని.. పైగా ఆమెకు భయపడి జీతభత్యాలు చెల్లిస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. చట్టబద్ధ సంస్థే అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయినా చంద్రబాబు వెనకాడుతున్నారని సోషల్ మీడియాలో తమ్ముళ్లు విరుచుకు పడుతున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :