Daku Maharaj: బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్' షూటింగ్ పూర్తి
- షూటింగ్ పూర్తి చేసుకున్న 'డాకు మహారాజ్' చిత్రం
- సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న భారీస్థాయిలో విడుదల
అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ,(Nandamuri Balakrishna) కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతోనూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. బాలకృష్ణ తన తదుపరి చిత్రం 'డాకు మహారాజ్'(Daku Maharaj)ను బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
కేవలం ప్రకటనతోనే 'డాకు మహారాజ్' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రచార చిత్రాలతో ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నందమూరి అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా చూడాలనే ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది.
తన చిత్రాలలో కథానాయకులను సరికొత్తగా చూపించడంలో దర్శకుడు బాబీ కొల్లి దిట్ట. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న 'డాకు మహారాజ్'లోనూ, బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్నారు.
టైటిల్ టీజర్ లో బాలకృష్ణ సరికొత్త లుక్, అద్భుతమైన విజువల్స్ కట్టిపడేశాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ భారీతనం కనిపించింది. యాక్షన్ సన్నివేశాలు, సంభాషణలు, నేపథ్య సంగీతం ఇలా ప్రతిదీ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. థియేటర్లలో ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని అందించే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను అందించబోతున్నట్లు, టీజర్ తోనే వాగ్దానం చేశారు దర్శకుడు బాబీ.
తాజాగా 'డాకు మహారాజ్' చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు ప్రకటించారు. ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 'డాకు ఇన్ యాక్షన్' పేరుతో చిత్రీకరణ సమయంలోని ఒక ఫొటోని విడుదల చేశారు నిర్మాతలు. ఆ ఫొటోలో దర్శకుడు బాబీ కీలక సన్నివేశం గురించి వివరిస్తుండగా, బాలకృష్ణ శ్రద్ధగా వింటూ కనిపించారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సంచలన స్వరకర్త ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.
'డాకు మహారాజ్' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.