అట్లాంటాలో శంకర నేత్రాలయ నిధుల సేకరణకు మంచి స్పందన
అట్లాంటాలో శంకర నేత్రాలయ అమెరికా సంస్థ పేద రోగుల దృష్టిని పునరుద్ధరించే మహత్తర కార్యక్రమం కోసం నిధులను సేకరించే లక్ష్యంతో ఒక శాస్త్రీయ నృత్య కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంతో శంకర నేత్రాలయ అమెరికా సంస్థ 1,300,000 డాలర్లను (సుమారు రూ.10 కోట్లు పైన)ని సేకరించింది. ఈ నిధులు ద్వారా 20,000 కంటిశుక్లం శస్త్రచికిత్సలు చేయవచ్చునని నిర్వాహకులు తెలిపారు. అట్లాంటాకు చెందిన నాలుగు ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య అకాడమీల నుంచి 100 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలతో వేదికను అలంకరించడం ద్వారా ఈ కార్యక్రమం విజయ వంతమయ్యింది. అకాడమీ ఆఫ్ కూచిపూడి వారు ప్రదర్శించిన వాసవీ కన్యకా పరమేశ్వరి నృత్యం ఆకట్టుకుంది. కలైవాణి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువు: పద్మజ కేలం మార్గదర్శనంలో శరణం అయ్యప్ప నృత్యప్రదర్శనను 13 మంది నృత్య కళాకారులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. శ్రీవాణి కూచిపూడి అకాడమీ ఆధ్వర్యంలో గురువు రేవతి కొమండూరి నిర్దేశకత్వంలో నాద బ్రహ్మ శంకర పేరుతో నృత్య ప్రదర్శన జరిగింది. 13 మంది కళాకారులు ఇందులో పాల్గొని ప్రశంసలను అందుకున్నారు.
ఎస్‌ఎన్ యుఎస్‌ఎ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ సభ్యుడు డాక్టర్ కిషోర్ చివుకుల 100,000 డాలర్లు విరాళంగా అందించారు. ఈ విరాళం సంస్థకు అవసరమైన కంటి సంరక్షణ సేవలను అత్యవసరమైన రోగులకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ జగదీష్ షేత్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఆకట్టుకున్నారు. అడాప్ట్-ఎ విలేజ్ కంటి శిబిరానికి స్పాన్సర్ చేయడానికి 12,500 డాలర్లు (రూ. 10 లక్షలు) విరాళం అందించి డాక్టర్ షేత్ తన మద్దతును మరింతగా చాటిచెప్పారు. ఈ సహకారం వందలాది మంది పేద రోగులకు కంటి చూపును పునరుద్ధరించడానికి సహాయపడటమే గాక కొత్త ఆశను కలిగిస్తుంది. ఆగస్టా, జార్జియా నుంచి రామచంద్రారెడ్డి 8 కంటి శిబిరాలకు 100,000 డాలర్లు విరాళం ప్రకటించారు. ఇక తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా నంది వడ్డెమాన్ గ్రామంలో ఒక కంటి శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఎస్‌ఎన్ యూఎస్‌ఏ ప్రెసిడెంట్ బాలా రెడ్డి ఇందుర్తి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మూర్తి రేకపల్లి భారతదేశంలో ఎంఇఎస్‌యు కార్యకలాపాల పురోగతిని వివరించారు. గ్రామీణ మారుమూల ప్రాంతాలకు చేరుకునే లక్ష్యంతో పేద రోగులకు సేవలను అందించడంపై దృష్టి పెట్టారు. భవిష్యత్తులో ఈ సేవలను మొత్తం భారతదేశానికి విస్తరించే ప్రణాళికను గురించి కూడా వెల్లడించారు.
ఎస్‌ఎన్ యూఎస్‌ఏ అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వంలో గణనీయమైన నిధులను సేకరించడం మాత్రమే కాకుండా, తన విశేష సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక శంకరరత్న పురస్కారం అందుకోవడం పట్ల నిర్వాహకులందరూ ఆయనకు అభినందనలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీని వంగిమల్ల, మెహర్ చంద్ లంక, రాజ్ ఐల, శ్రీధర్ జూలపల్లి, నీలిమ గడ్డమణుగు, డాక్టర్ మాధురి నాముదురి, స్పోర్ట్స్ కమిటీ చైర్ రమేష్ చాపరాల, ఎంఇఎస్‌యు కమిటీ సభ్యుడు డాక్టర్ కిషోర్ రెడ్డి రసమల్లు వంటి ప్రముఖుల నుంచి నిరంతరం మద్దతు అందింది.
అట్లాంటా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తడికమళ్ళతో పాటు చాప్టర్ లీడర్స్ చిన్మయ్ దస్మోహపాత్ర, హేమంత్ వర్మ, పేన్మెట, సుధీర్ పాత్రో, విజయ్ గార్లపాటి ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. మూర్తి రేకపల్లి, నీలిమ గడ్డమణుగు, మెహర్ లంక, శ్రీని రెడ్డి వంగిమళ్ల, ఉపేంద్ర రాచుపల్లి, డా. మాధురి నాముదూరి, రాజశేఖర్ ఐల, సురేష్ వేములమాడ, శ్రీధర్ రావు జూలపల్లి, రాజేష్ తడికమల్ల, రమేష్ చాపరాల, డాక్టర్ కిషోర్ రాసమల్లు - ఈ కార్యక్రమాన్ని ఘనవిజయంగా నిర్వహించారు. డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి, సెక్రటరీ శ్యామ్ అప్పాలి మాస్టర్స్ ఆఫ్ సెర్మనీ, శంకరనేత్రాలయ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.