భారత్‌లో వాయిదా వేయించుకోవచ్చు కానీ ... అమెరికాలో
లక్షల కోట్ల రూపాయలు దోచేసిన జగన్ రెడ్డికి ఇప్పటికీ శిక్ష పడకపోవడమేంటో అర్థం కావడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తర భారతంలో రూ.100 కోట్ల అవినీతి కేసుల్లోనూ అనేక మంది సీఎంలు జైలు పాలయ్యారని గుర్తు చేశారు. చట్టంలోని లొసుగులు, అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి మన దేశంలో తప్పించుకుంటున్నారని ఆరోపించారు. అదానీ విద్యుత్ ఒప్పందాలపై అమెరికాలో నమోదైన కేసుల నుంచి జగన్ తప్పించుకోవడం అసాధ్యం అని వ్యాఖ్యానించారు. భారత్‌లో తనపై ఉన్న కేసుల విచారణలను వాయిదా వేయించుకోవచ్చు కానీ, అమెరికాలో కేసులు వాయిదా వేయించుకునే అవకాశం లేదని పేర్కొన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలు పట్టించుకోకుండా జగన్ బెంగళూరుకు పారిపోవడం దారుణమన్నారు. అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేకపోతే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జగన్ రెడ్డితో సంబంధం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు పునరాలోచన చేయాలని సూచించారు.