ప్రభుత్వం మారింది.. సాక్షాలు మారాయి.. పవన్ పై కేసు ఎత్తివేత..
ఆంధ్రాలో 2024 ఎన్నికల తర్వాత కోర్టు కేసులు, నిందలు, ఆరోపణలు సర్వసాధారణంగా మారుతున్నాయి. కొత్త కేసులు పుట్టుకు వస్తున్నాయి.. పాత కేసులు మరుగున పడుతున్నాయి.. గతంలో నేతలపై పెట్టిన కేసులు కొట్టివేస్తున్నారు.. మరి కొంతమందిపై ఉన్నవి లేనివి కలిపి మరి కేసులు పెడుతున్నారు. ఏం జరుగుతుందో ఎటు తెలియని ఈ పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా ఒకటి స్పష్టంగా తెలుస్తోంది…ప్రభుత్వం మారింది.. కాబట్టి కేసులు కూడా మారుతాయి.
తాజాగా ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పెట్టిన క్రిమినల్ కేసును కోర్టు కొట్టివేసింది. విశేషం ఏమిటంటే గతంలో ఆయనపై ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు ఈ విషయం తెలియని తెలియదంటూ కోర్టులో సాక్షాలు చెప్పారు. ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థపై కూటమినేతలు ఎన్నో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వాలంటీర్లను అసాంఘిక శక్తులుగా.. హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్న వ్యక్తులకు సహకారకులుగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పలు రకాల ఫిర్యాదులకు దారి తీసాయి.
ఈ విషయంలో అప్పట్లో ఎందరో వాలంటీర్లు జనసేనాని పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడంతో పాటు రహదారులపై నిరసన కూడా వ్యక్తం ఈ నేపథ్యంలో గుంటూరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కొంతమంది పవన్ తమ మనోభావాలను కించపరిచేలా మాట్లాడారు అంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడంతో, గత ఏడాది జులై 20న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వుల ఆధారంగా గుంటూరు జిల్లాలో పవన్ పై ఐపీసీ 499, 500 సెక్షన్స్ కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
అనంతరం ఎన్నికలు జరిగాయి, ప్రభుత్వం మారింది. దీంతో ఇప్పుడు తాజాగా ఈ కేసుకు తమకు సంబంధం లేదంటూ, అసలు ప్రభుత్వానికి దాఖలు చేసిన ఫిర్యాదులో తాము సంతకం చేయలేదంటూ వాలంటీర్లు కోర్టుకు తెలియపరిచారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై గతంలో నమోదు చేయబడిన క్రిమినల్ కేసులు తొలగిస్తూ గుంటూరులోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శరత్ బాబు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.