ASBL NSL Infratech

హాథ్రస్ విషాదం వెనక..?

హాథ్రస్ విషాదం వెనక..?

ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ లో విషాదం చోటు చేసుకుంది. బోలేబాబా పాదధూళి కోసం వచ్చిన భక్తులు.. తొక్కిసలాటలో నలిగి ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 120 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగాపెరిగే ప్రమాదం కనిపిస్తోంది. భోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడటంతోపాటు ఆయనలో పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు, ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకోవడంతో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు. 23 మృతదేహాలను ఎటా జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన మృతదేహాలను, క్షతగాత్రులను అంబులెన్సులు, కార్లు, ట్రక్కులు, టెంపోల్లో హాథ్రస్‌లోని సికంద్రరావ్‌ ట్రామా కేర్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆసుపత్రి ఆవరణలో మృతదేహాలను ఉంచడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

ఇంటికి వెళ్లే సయంలో..

సత్సంగ్‌ను ముగించుకుని సాయంత్రం 3.30 గంటల సమయంలో భక్తులంతా ఇంటికి వెళ్లే సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందని, జనమంతా ఒకరిపై ఒకరు పడటంతో ఎక్కువ మంది చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భక్తుల భారీ రద్దీవల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని సికంద్రరావ్‌ ఠాణా అధికారి ఆశిష్‌ తెలిపారు. సత్సంగ్‌ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు.

భోలే బాబా గంటన్నరపాటు ఈ కార్యక్రమంలో గడిపారు. ఆ తర్వాత బయలుదేరిన సమయంలో ఆయన పాదాలను తాకడానికి భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. మైదానం చిత్తడిగా ఉండటంతో మరింత ప్రమాదకరంగా మారిందని సత్సంగ్‌లో పాల్గొన్న సోను కుమార్‌ తెలిపారు. మైదానాన్ని మించి జనం వచ్చారని, ఏర్పాట్లు అందుకు తగ్గట్లుగా లేవని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.

పార్లమెంటులో నివాళి

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడుతున్నప్పుడు ఘటన గురించి తెలియడంతో ఆయన వెంటనే సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ‘ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు యూపీ ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా’ అని ప్రధాని తెలిపారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :