ASBL Koncept Ambience
facebook whatsapp X

IAS: ఐఏఎస్‌లకు ఎందుకంత మొండిపట్టు..? హైకోర్టులోనూ చుక్కెదురే..!!

IAS: ఐఏఎస్‌లకు ఎందుకంత మొండిపట్టు..? హైకోర్టులోనూ చుక్కెదురే..!!

సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు (Civil servants) దేశంలో ఎక్కడైనా పనిచేయాలనే నిబంధనలున్నాయి. వాళ్లు జాతీయ స్థాయి అధికారులు. IAS, IPS లాంటి సివిల్ సర్వీసులకు ఎన్నికై బాధ్యతలు చేపట్టిన తర్వాత డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) ఆదేశాల మేరకు వాళ్లు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సహజంగా ట్రైనింగ్ తర్వాత పోస్టింగ్ సమయంలోనే వివిధ రాష్ట్రాలకు వాళ్లను అసైన్ చేస్తారు. ఆ రాష్ట్ర కేడర్ లో (cadre)  వాళ్లు పని చేయాల్సి ఉంటుంది. అయితే అప్పుడప్పుడు కొంతమంది సివిల్ సర్వెంట్లు తమ వ్యక్తిగత అవసరాల మేరకు వివిధ రాష్ట్రాలకు (states) బదిలీ అవుతుంటారు. అయితే గడువు ముగిసిన తర్వాత మళ్లీ సొంత కేడర్ కు వెళ్లాల్సి ఉంటుంది.

కానీ ఇప్పుడు ఏపీ (AP), తెలంగాణలో (Telangana) కొంతమంది ఐఏఎస్ లు ఇలా సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి ససేమిరా అంటున్నారు. ఈ అంశం ఇప్పుడు హైకోర్టు (highcourt) వరకూ వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ కేడర్ (AP Cadre)కు చెందిన కాటా ఆమ్రపాలి (Amrapali), వాకాటి అరుణ (Vakati Aruna), వాణీ ప్రసాద్ (Vani Prasad), సర్ రోనాల్డ్ రాస్ (Sir Ronald Ros).. DPOT ఆదేశాల మేరకు తెలంగాణలో ఇప్పుడు పని చేస్తున్నారు. వీళ్లను తమ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు ఈ నెల 16లోగా వెళ్లి రిపోర్ట్ చేయాలని DPOT ఆదేశించింది. అలాగే.. ఏపీలో పని చేస్తున్న సృజన (Srijana), హరి కిరణ్ (Hari Kiran), శివశంకర్ (SivaShankar).. తెలంగాణలో రిపోర్టు చేయాల్సి ఉంది. అయితే తాము తమ సొంత రాష్ట్రాలకు వెళ్లబోమని.. ఇప్పుడున్న చోటే పని చేస్తామని పట్టుబడుతున్నారు. ఇందుకు డీవోపీటీ నిరాకరించింది.

DOPT ఆదేశాలను సవాల్ చేస్తూ వీళ్లంతా  సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్- CATని ఆశ్రయించారు. క్యాట్ కూడా వాళ్లకు గట్టిగానే అక్షింతలు వేసింది. సివిల్ సర్వెంట్లు దేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. సరిహద్దుల్లో సైనికులు పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. వరదల్లో ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి సేవ చేయాలనే ఆలోచన లేదా అని ప్రశ్నించింది. వెంటనే వెళ్లి తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. అయితే క్యాట్ తీర్పు వాళ్లకు ఏమాత్రం నచ్చలేదు. వెంటనే హైకోర్టును ఆశ్రయించారు.

వాస్తవానికి ఇవాళ అంటే 16న వీళ్లంతా సొంత కేడర్ రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే అలా వెళ్లడం ఇష్టంలేని వీళ్లంతా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు వాళ్ల పిటిషన్లను డిస్మిస్ చేసింది. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. వెంటనే వెళ్లి సొంత కేడర్ రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. జాయిన్ అయ్యేందుకు కనీసం 15 రోజులపాటు వెసులుబాటు ఇవ్వాలన్న విజ్ఞప్తిని కూడా తెలంగాణ హైకోర్టు అంగీకరించలేదు. దీంతో ఏమీ చేయలేని సివిల్ సర్వెంట్లు పరుగుపరుగున రిపోర్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వీళ్లను రిలీవ్ చేసి బాధ్యతలను వేరే వాళ్లకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నాయి. అయినా సివిల్ సర్వెంట్లు సొంత కేడర్ ను వదిలేసి ఇతర రాష్ట్రాల్లోనే పనిచేస్తామని ఎందుకు పట్టుబడుతున్నారో అర్థం కాని పరిస్థితి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :