ASBL Koncept Ambience
facebook whatsapp X

బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలు ఎందుకు పదేపదే రోడ్డెక్కుతున్నారు...?

బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలు ఎందుకు పదేపదే రోడ్డెక్కుతున్నారు...?

విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్ లో అధికారమార్పిడి జరిగిపోయింది. షేక్ హసీనా భారత్ పారిపోగా.. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలికప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. ఇంకేముంది విద్యార్థులు, ఇతర రాడికల్ వర్గాలు అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగింది కదా.. ఇంకా ఎందుకు బంగ్లాదేశ్ లో అనిశ్చితి స్థితి కొనసాగుతోంది. మూడు నెలలైనా తాత్కాలిక ప్రభుత్వం.. అల్లర్లను ఎందుకు అదుపు చేయలేకపోతోంది. మహ్మద్ యూనిస్ నిజంగా అధికారం చలాయించలేకపోతున్నారా..? లేక సైన్యం, ఖలీదా జియా పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారారా..?

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై 3 నెలల్లో 2000కు పైగా దాడులు జరిగాయి. భద్రతను కోరుతూ హిందువులు వీధుల్లోకి వచ్చారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీ గ్రూప్ బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యత మండలి ఆగస్టు 4 నుంచి హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. ఈ దాడులు పెరుగుతుండడంతో శనివారం ఢాకాలో హిందువులు రోడ్డుమీదకు వచ్చారు. భారీ ర్యాలీ నిర్వహించి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాన్ని 8 డిమాండ్లు చేస్తున్న ఆందోళనకారులు

బంగ్లాదేశ్‌లోని హిందూ కార్యకర్తలు ఢాకాలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. మైనారిటీల రక్షణ కోసం చట్టం చేయడంతోపాటు 8 అంశాలపై ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్నారు. మైనారిటీలకు మంత్రిత్వ శాఖ కావాలన్న డిమాండ్ కూడా ఆ అంశాల్లో ఒకటిగా ఉంది. దీనికి తోడు తమపై జరుగుతున్న దాడులను, వేధింపుల నుంచి తమను రక్షించాలని.. హిందూ సమాజ నాయకులపై దేశద్రోహం కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ మొత్తం జనాభా 170 మిలియన్లు. అందులో 91 శాతం ముస్లిం జనాభా, 8 శాతం హిందువుల జనాభా ఉన్నారు.

వాస్తవానికి బీఎన్పీ అధికారం చేపట్టాలని భావించినా.. విద్యార్థులు అంగీకరించకపోవడంతో మహ్మద్ యూనిస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే బయటకు ప్రభుత్వం కనిపిస్తున్నా.. అక్కడ అతివాద, రాడికల్ ఇస్లామిస్టులదే పైచేయిగా కనిపిస్తోంది. గతంలో ఎవరు హసీనా పార్టీకి మద్దతుగా నిలిచారో వారందరిపైనా వరుసగా దాడులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా హిందూ మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ వాదులు దాడులు చేస్తున్నారు. తమను కాపాడాలని వేడుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో .. వారు తమ సమస్యను ర్యాలీల ద్వారా ప్రపంచం దృష్టికి తెస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి ఆందోళన

మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ప్రభుత్వం పాలనలో... దేశంలో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల అధికారులు, ఇతర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పొరుగు దేశంలో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామన్న అమెరికా

బంగ్లాదేశ్ పరిస్థితిపై భారత్ మాత్రమే కాదు అమెరికా కూడా వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పదవీచ్యుతురాలైనప్పటి నుంచి మానవ హక్కులను తాను పర్యవేక్షిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. అలాగే ఇటీవలి ఎన్నికల ప్రచారంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న అనాగరిక హింసను తీవ్రంగా ఖండిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బంగ్లాదేశ్ మైనార్టీలపై దాడులు, దోపిడీలు జరుగుతున్నాయని బంగ్లాదేశ్ పూర్తి అరాచక స్థితిలో ఉందన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :